ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా శ్రీశైలం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సంకల్పించిందని కేంద్ర ప్రభుత్వ పర్యాటక శాఖ కార్యదర్శి ఎ.విద్యావతి తెలిపారు. ఈ మేరకు బుధవారం శ్రీశైలంలోని దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో విద్యావతి అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మేనేజింగ్ డైరెక్టర్ అమ్రపాలి, నంద్యాల జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, పర్యాటకశాఖ అధికారులు పాల్గొన్నారు. శ్రీశైల యాత్రకు వచ్చిన పర్యాటకులు శ్రీశైలంలోనే నాలుగు రోజుల పాటు బస చేసి, ఇక్కడి పర్యాటక ప్రదేశాలను సందర్శించుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై ఈ సమావేశంలో చర్చించారు. శ్రీశైలంలో స్వామిఅమ్మవార్ల దర్శనంతో పాటు, పరిసర ప్రాంతాలైన శ్రీశైలం డ్యాం, స్పిల్వే గురించి వివరించడం, జంగిల్ సఫారీ, టైగర్ సఫారీ, చిన్నపిల్లల కోసం అమెజింగ్ పార్క్లపె ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. క్షేత్ర పరిధిలో ప్రస్తుతం ఆటోలు, సైట్ సీయింగ్ జీపుల వారికి ఏమైనా గుర్తింపు కార్డులు ఉన్నాయా, ఎంత చార్జీలు వసూలు చేస్తున్నారు అనే విషయాలపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగా శ్రీశైలం, ద్వారకా, ఖజురహో ప్రదేశాలను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు. ఈ సమావేశంలో పర్యాటకులకు ప్రస్తుతం అందుతున్న సేవలు, మెరుగైన పర్యాటక సేవల గురించి పూర్తిస్థాయిలో చర్చించామని అన్నారు. మరో 8 ఎనిమిది నెలల్లో మూడు దఫాలుగా సమావేశాలు నిర్వహించి ఆయా సమస్యలను పరిష్కరించడానికి కార్యచరణ, ప్రణాళికలను సిద్ధం చేస్తామన్నారు.
కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి విద్యావతి
Comments
Please login to add a commentAdd a comment