మార్మోగుతున్న గోవింద నామస్మరణ
రుద్రవరం: అహోబిలేశుడి పార్వేట ఉత్సవాల్లో గోవింద నామస్మరణ మార్మోగుతోంది. ఉ త్సవమూర్తులైన జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాదవరద స్వామి పల్లకీలో కొలువై గ్రామ గ్రామానికి వెళ్లి తెలుపుల మీద కొలువు దీరగా ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. బుధవారం పల్లకీ ముత్తలూరు నుంచి నల్లవాగుపల్లెకు చేరుకోగా ఆ గ్రామ పెద్దలు మేళ తాళాలతో ఎదురెళ్లి స్వాగతం పలికారు. తర్వాత పల్లకీ అక్కడి నుంచి ఆళ్లగడ్డ మండలం బాచాపురానికి చేరుకుంది.
వీబీఆర్‌లో చేప పిల్లల విడుదల
వెలుగోడు: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో బుధవారం 5 లక్షల చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ రాఘవరెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా వాటిని విడుదల చేశామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 40% సబ్సిడీ తో చేప పిల్లలు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య అభివృద్ధి అధికారి పామన్న, భరత్ లాల్ నాయక్, జిల్లా మత్స్య సహకార సంఘం ప్రెసిడెంట్ నవీన్, నాయకులు అన్నారపు శేషి రెడ్డి, అబ్దుల్ కలాం, శంకర్ రెడ్డి, మత్స్య సహాయకులు ఉదయ్, చంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలం నుంచి 14,300 క్యూసెక్కుల నీరు విడుదల
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైల జలాశయం ద్వారా మంగళవారం నుంచి బుధవారం వరకు దిగువ ప్రాజెక్ట్‌లకు 14,300 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 4.021 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్‌కు 7,770 క్యూసెక్కుల నీటిని వదిలారు. అలాగే బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 2,500, హంద్రీనీవా సుజలస్రవంతికి 1,630, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అలాగే ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో పంప్‌మోడ్ ఆపరేషన్ ద్వారా 7,361 క్యూసెక్కుల నీటిని జలాశయంలోకి మళ్లించారు.బుధవారం సాయంత్రం సమయానికి జలాశయంలో 88.6777 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం నీటిమట్టం 853.80 అడుగులకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment