
ఉపాధిలో అక్రమాలకు తెర లేపారు!
కోవెలకుంట్ల: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను అధికార పార్టీ కార్యకర్తల జేబులు నింపేందుకు కూటమి సర్కార్ అక్రమాలకు తెరలేపారు. నిబంధనలను సైతం మార్చి వేసి పథకాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు పావులు కదిపారు. జిల్లాలో 489 మంది ఫీల్ట్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాదాపు 200 మందికి పైగా ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగించింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గతంలో పనిచేస్తున్న ఫీల్ట్ అసిస్టెంట్లు వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులని కక్ష కట్టి వారిని విధుల నుంచి తప్పించారు. ఆయా మండలాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల తమ వర్గానికి చెందిన వ్యక్తులకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు కావాలని ఆ పార్టీలో వర్గపోరు జరుగుతుండటంతో ఇప్పటికి చాలా గ్రామాల్లో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఈ కారణంగా ఆయా గ్రామాల్లో ఉపాధి పనులు నిలిచిపోయి కూలీలకు పనులు లేకుండా పోయాయి. అలాగే ఉపాధి హామీ పథకంలో గతంలో ప్రతి 20 మంది కూలీలకు ఒక మేటిని ఉండేవారు. అందరిక కూలీల్లాగే మేటీ సైతం ఉపాధి పనులు చేయాల్సి వచ్చేది. మేటీతోపాటు ఆ గ్రూపులో ఉన్న 20 మంది కూలీలకు సమానంగా వేతనం అందేది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మేటీల వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకుంది. మేటీలను కుదిస్తే ఉపాధి పథకంలో అక్రమాలు సులువుగా చేయవచ్చని ఇరవై మందికి కాకుండా ప్రతి 50 మంది కూలీలకు ఒక మేటిని నియమించాలని కొత్త నిబంధనను తెరపైకి తెచ్చారు. జిల్లాలో 2.55 లక్షల మంది కూలీలు పనులు చేస్తుండగా 5,100 మంది మేటీలను నియమించేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్తగా నియమించే మేటీలకు పనులు చేసే వేతనంతో పాటు మేటీగా ఉన్నందుకు అదనంగా డబ్బులు చెల్లించేలా చర్యలు చేపట్టారు. దీంతో మేటీలుగా తమ అనుచరులను నియమించుకునేందుకు తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలు, వారి అనుచరులు మేటీలుగా అవతారమెత్తారు. కూటమి పార్టీకి చెందిన మేటీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు బినామీ మస్టర్లతో ఉపాధి పథకాన్ని పెద్ద ఎత్తున దోచుకుని కూలీల కడుపుకొట్టేందుకు కొందరి అధికారులతో కుమ్మకై నట్లు తెలుస్తోంది.
13 లక్షల పని దినాలు.. 37 రోజులు
జిల్లాలోని 29 మండలాల పరిధిలో 4.38 లక్షల జాబ్‌కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 8.70 లక్షల మంది కూలీలు ఉన్నారు. 1.50 లక్షల కుటుంబాల్లోని 2.55 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు వెళుతున్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఆయా మండలాల్లో 75 లక్షల పనిదినాలు లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందుకోసం రూ. 335 కోట్ల లేబర్ (కూలీల వేతనం, మెటీరియల్ కలిపి) బడ్జెట్ కేటాయించారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి నిర్ధేశించిన లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలోని ఆయా మండలాల్లో 61.99 లక్షల పనిదినాలు పూర్తి అయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 37 రోజులు మాత్రమే గడువు ఉంది. ఇంకా 13 లక్షల పనిదినాలు పూర్తి చేయాల్సి ఉంది.
గతంలో ఇరవై మందికి ఒక మేటి
ప్రస్తుతం 50 మందికి ఒక మేటి
ఏర్పాటు దిశగా చర్యలు
మేటీలను కుదిస్తే పనుల్లో
అక్రమాలు సులువు
టీడీపీ నాయకుల అనుచరులు
మేటీలుగా అవతారం
ఉపాధి పనులను వేగవంతం చేయాలి
జిల్లాలో వ్యవసాయ పనులు పూర్తి అయిన దృష్ట్యా గ్రామాల్లో ఉపాధి పనులను వేగవంతం చేయాలి. ఈ ఆర్థిక సంవత్సంలో ఇంకా 13 లక్షల పనిదినాలు పూర్తి చేయాల్సి ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్లు, మేటీల నియామకాల్లో రాజకీయాన్ని పక్కన పెట్టి కూలీలకు పనులు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి, కోవెలకుంట్ల
రాజకీయ కుట్రతో తొలగించారు
2019వ సంవత్సరం నుంచి ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. ఐదేళ్లపాటు గ్రామంలోని కూలీలకు ఉపాధి పనులు కల్పించి వారికి ప్రతి రోజు సగటు వేతనం అందేలా తన వంతు కృషి చేశాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజకీయ కక్షతో ఫీల్డ్ అసిస్టెంట్‌గా తొలగించారు. టీడీపీ నాయకులకు అనుకూలంగా ఉన్న వ్యక్తులను నియమించుకున్నారు.
– రాఘవరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్, కంపమల్ల, కోవెలకుంట్ల మండలం

ఉపాధిలో అక్రమాలకు తెర లేపారు!

ఉపాధిలో అక్రమాలకు తెర లేపారు!
Comments
Please login to add a commentAdd a comment