
బంగారు ధారా పాత్ర బహూకరణ
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వరస్వామికి వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాభూపాల్‌రెడ్డి, ఆయన సతీమణి కాటసాని ఉమామహేశ్వరమ్మ, ఆయన కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి ఐదున్నర తులాల బంగారు ధారా పాత్ర బహూకరించారు. అలాగే ఎనిమిది కేజీల వెండీ హారతులను ఆలయ ఈఓ చంద్రుడుకు బుధవారం అందజేశారు. ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ముందుగా ఆలయంలో వెలసిన ఉమామహేశ్వరస్వామికి మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం కాటసాని కుటుంబ సభ్యులను అర్చకులు సత్కరించారు. ఉమామహేశ్వర నిత్యాన్నదాన సంస్థ సభ్యులు దస్తగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దద్దణాల చెరువుకు
ఎస్సార్బీసీ నీరు
బనగానపల్లె రూరల్: దద్దణాల చెరువుకు జుర్రేరువాగు ఎత్తిపోతల పఽథకం నుంచి నీటి విడుదలను మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఇచ్చిన హామీ మేరకు తన సొంత నిధులు రూ.25.75 లక్షలతో ఎత్తిపోతల పథకానికి సంబంధించిన నాలుగు మోటార్లకు మరమ్మతు చేయించామన్నారు. చెరువుకు ఎస్సార్బీసీ నుంచి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
నేడు వక్ఫ్‌బోర్డు చైర్మన్ రాక
కర్నూలు(అర్బన్): రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ గురువారం కర్నూలుకు రానున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి సయ్యద్ సబీహా పర్వీన్ తెలిపారు. ఉదయం 8 గంటలకు నెల్లూరు నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వ అతిథి గృహం చేరుకుంటారని ఆమె బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఇద్దరి ప్రాణాలు కాపాడిన యువకులు
హొళగుంద: స్థానిక హొళగుంద–బళ్లారి రోడ్డులోని తుంగభద్ర దిగువ కాలువ(ఎల్లెల్సీ)లో స్నానానికి వెళ్లి ఈత రాక కొట్టుకుపోతున్న ఇద్దరిని స్థానిక యువకులు కాపాడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పకు చెందిన షమీ, బాషాతో పాటు పలువురు హొళగుందలోని ఓ మసీదులో పెయింట్ పనికి వచ్చారు. పని ముగించుకుని సాయంత్రం స్నానం చేసేందుకు బళ్లారి రోడ్డులోని దిగువ కాలువలో దిగారు. ఇటీవల కాలువ గట్టుకు సిమెంట్ లైనింగ్ చేయడంతో ఈత షమీ, బాషా గట్టు కింద జారుకుంటూ కాలువలో కొట్టుకోపోసాగారు. వారి అరుపులు విన్న అటుగా వెళ్తున్న సిద్దిక్, మౌలాలి, సమీర్ వెంటనే కాలువలో దూకి ఇద్దరినీ బయటకు లాగారు. దీంతో యువకులను పలువురు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment