వచ్చాడయ్యో స్వామి..!
ఆళ్లగడ్డ: తమ వివాహ మహోత్సవానికి భక్తులను ఆహ్వానించేందుకు పార్వేటగా కొండ దిగిన జ్వాలా నారసింహస్వామి, ప్రహ్లాదవరదుడు తిరిగి అహోబిలం క్షేత్రం చేరుకున్నారు. 33 గ్రామాల్లో పల్లకీలో విహరిస్తూ పార్వేట ముగించుకుని క్షేత్రం చేరుకున్న స్వామి వార్లకు వేద పండితులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. పొలిమేర వరకు వేదపండితులు ఎదురేగి మంగళ వాయిద్యాలతో గోవింద నామస్మరణ చేసుకుంటూ ఉత్సవమూర్తులను ఆలయ సన్నిధికి చేర్చారు. స్వామి రాకతో క్షేత్రంలో పండుగ వాతావరణం నెలకొంది. పార్వేటగా గ్రామాల్లో సంచరిస్తూ అలసి పోయిన స్వామి వార్ల ఉత్సవమూర్తులకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా నవకళశ స్థాపన (108 కలశాలు)తో పంచామృతాభిషేకం నిర్వహించారు. వేద పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రాయశ్చిత్య, లఘు సంప్రోక్షణ హోమం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను నూతన పట్టు పీతాంబరాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ పూజలు ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యానారయణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. దిగువ అహోబిలంలో పూజల అనంతరం జ్వాలా నరసింహస్వామిని పల్లకీలో ఎగువ అహోబిలానికి చేర్చి పూజలు చేపట్టారు.
పార్వేట ముగించుకుని కొండకు చేరిన అహోబిలేశులు
ప్రాయశ్చిత్య హోమం, లఘు సంప్రోక్షణ
వచ్చాడయ్యో స్వామి..!
Comments
Please login to add a commentAdd a comment