నంద్యాల(న్యూటౌన్): కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య నంద్యాల పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సంస్కృతం సబ్జెక్టు పేపరుతో స్పాట్ వాల్యుయేషన్‌ను ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన 2,06,280 జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో చేపట్టనున్నారు. జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి క్యాంప్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ నిర్వహిస్తారు. ఒక అసిస్టెంట్ ఎగ్జామినర్ (ఏఈ) రోజుకు 30 జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ప్రతి ఐదుగురు ఏఈలకు ఒక చీఫ్ ఎగ్జామినర్ (సీఈ) ఉంటారు. ఏఈ మూల్యాంకనం చేసే జవాబు పత్రాలను సీఈ పరిశీలిస్తారు. ఏఈలు, సీఈ కలిపి ఉండే బోర్డుకు ఒక స్క్రూటినైజర్ ఉంటారు. ఏఈలు అన్ని ప్రశ్నల జవాబులు మూల్యాంకనం చేశారా, లేదా, మార్కుల టోటల్.. తదితర విషయాలను వారు పరిశీలిస్తూంటారు. సబ్జెక్టు నిపుణులు కూడా ఏఈలు మూల్యాంకనం చేసే పేపర్లను పరిశీలించి, తేడాలుంటే సూచనలిస్తారు. మూల్యాంకానికి అసరమైన సిబ్బందిని నియమించారు. ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేని విధంగా మూల్యాంకనం చేపడుతున్నామని ఇంటర్ జిల్లా విద్యాధికారిణి సునీత తెలిపారు. ఈనెల 20వ తేదీన ఇంటర్ పరీక్షలు ముగుస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment