
అహోబిలంలో బీ – ట్యాక్స్ మీ ఘనత
ఆళ్లగడ్డ: ఎక్కడి నుంచో ఓ వ్యక్తిని ఇక్కడికి తీసుకొచ్చి బీ– ట్యాక్స్ వసూలు చేస్తున్న ఘనత మీదంటూ ఎమ్మెల్యే అఖిలప్రియపై ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి మండిపడ్డారు. అహోబిలం క్షేత్రం ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో బహిరంగ చర్చకు సిద్ధమా.. అని సవాల్ విసిరారు. శనివారం ఆయన అహోబిలం చేరుకుని బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అహోబిల క్షేత్రం ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, అంతా తమ టీడీపీ పాలనలోనే జరిగిందని ఎమ్మెల్యే మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో క్షేత్రంలో కనీసం ఒక్క రోడ్డు అయినా వేశారా అని ప్రశ్నించారు. ఆళ్లగడ్డ నుంచి అహోబిలం వరకు బీటీ రోడ్డు, మాడ వీధుల్లో సీసీ రోడ్లు అన్ని తమ ప్రభుత్వంలో వేసినవే అని గుర్తు చేశారు. సొంత పార్టీ కార్యకర్తలను సైతం రాబంధుల్లా పీక్కు తింటుండటంతో చెప్పుకోలేక సిగ్గుతో తలదించుకుంటున్నారన్నారు. నాడు తిరుమల లడ్డూపై రాద్దాంతం చేసి నేడు అహోబిలేశుడికి వారం రోజుల పాటు నైవేద్యం దూరం చేసిన చరిత్ర వారేదన్నారు. చివరకు బ్రహ్మోత్సవాల సందర్భంగా పందిళ్లు వేసే వారితో కూడా కమీషన్లు నొక్కడం అందరికీ తెలుసునన్నారు. మాన్యం భూముల వేలం పాట నిధులు ఏడాదైనా దేవస్థానానికి ఎందుకు చెల్లించ లేదన్నారు. టోల్‌గేట్‌ను ఎంతకు అమ్ముకున్నారు.. ఆ డబ్బులు ఎవరు తింటున్నారో స్థానికులు ఆలోచన చేయాలన్నారు. టీడీపీ నేతల అక్రమాలను వెలుగులోకి తెస్తున్న విలేకరులను బెదిరించాలని చూడటం సరికాదన్నారు. విలేకరులను భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. అహోబిలేశుని పార్వేట పల్లకీ ఎలా వెళ్లాలి అన్నది కూడా మీరు నిర్ణయిస్తారా అని ప్రశ్నించారు. అనాదిగా వస్తున్న ఆచారాలను సైతం పాటించకపోవడం విడ్డూరమన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు భూమా కిషోర్‌రెడ్డి, గంధం రాఘవరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు నాసారి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
మంత్రిగా ఉండి ఒక్క రోడ్డు కూడా
వేయలేక పోయావు
వారం రోజులు దేవుడికి నైవేద్యం
దూరం చేసినది మీరు కాదా?
ఎమ్మెల్యే అఖిలప్రియపై మండిపడిన
మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment