‘స్కానింగ్’ కష్టాలు
● గర్భిణులకు తప్పని తిప్పలు
● నంద్యాల జిల్లా ఆసుపత్రిలో
రేడియాలజిస్టులు కరువు
● పట్టించుకోని అధికారులు
గోస్పాడు: జిల్లా ఆసుపత్రిలో స్కానింగ్ సెంటరు తలుపులు తెరచుకోవడం లేదు. దీంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నంద్యాల జిల్లా ఆసుపత్రికి జిల్లా ప్రజలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో సమీప జిల్లాలైన వైఎస్సార్, ప్రకాశం సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. ప్రతిరోజు 1,100 నుంచి 1,300 మందితో ఓపీ రద్దీగా కనిపిస్తుంది. ప్రతిరోజు ఇక్కడికి గర్భిణులు, బాలింతలు 70 మందికి పైగా చికిత్స పొందేందుకు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీరితోపాటు అత్యవసర వైద్య సేవలు పొందేందుకు వచ్చే వారికి కూడా కొన్ని సందర్భాలలో వ్యాధి నిర్ధారణకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు చేయించాలని అక్కడి వైద్యులు సూచిస్తుంటారు. అయితే గర్భిణులు, బాలింతలుతోపాటు రోగాలతో వచ్చే పేద ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఇదీ సమస్య..
జిల్లా ఆసుపత్రిలో ముగ్గురు సీనియర్ రెసిడెంట్‌లు, ఒకరు అసోసియేట్, ఒక అసిస్టెంటు ప్రొఫెసర్ ఉండాలి. ప్రస్తుతం ఒక్కరూ కూడా పనిచేసేవారు లేరని స్థానిక వైద్యాధికారులు చెబుతున్నారు. గతంలో కొంతకాలం పాటు సీనియర్ రెసిడెంట్ సేవలందించేవారు. ప్రస్తుతం ఎవరూ లేక నెలలు గడుస్తుంది. దీంతో అవసరమైన సందర్భాలలో మాత్రమే తప్పని పరిస్థితులలో స్కానింగ్ పరీక్షలకు రాయాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
● అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలను ప్రతిరోజూ వందకు పైగా చేయించాల్సి ఉంది. అయితే స్కానింగ్ కేంద్రంలో రేడియాలజిస్టులు లేదు. దీంతో వైద్యుల సూచన మేరకు పేదవారు ఉసూరుమంటూ పట్టణంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. వందలాది రూపాయలను ఖర్చుచేస్తూ చేతిలో ఉన్న అరకొర సొమ్మును కాజేసుకొని అవస్థలు పడుతున్నారు.
దోపిడీ ఇలా..
ఒక్కో స్కానింగ్‌కు రూ.700 నుంచి రూ.వెయ్యి వరకు ఖర్చుచేయాల్సి వస్తుంది. ఒక్కో స్కానింగ్ సెంటరులో ఒక్కో విధంగా ప్రజల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రోజుకు వంద మందికి పైగా స్కానింగ్‌లకు వెళ్లాల్సి వస్తుండటంతో పట్టణంలోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లను రోగులు ఆశ్రయిస్తున్నారు. దీంతో పేదప్రజల అవసరాలను ఆసరా చేసుకున్న కొన్ని స్కానింగ్ సెంటర్లు దోపిడీ చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. స్కానింగ్ సెంటర్లలో ఇష్టారాజ్యంగా తీసుకునే ఫీజుల్లో వ్యత్యాసం జరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు.
ఉన్నతాధికారులకు నివేదించాం
ఆసుపత్రిలో రేడియాలజిస్టుల కొరతగా ఉంది. జిల్లా ఆసుపత్రికి రోగుల సంఖ్య అధికంగానే ఉంటుంది. వ్యాధి నిర్ధారణకు కొన్ని సమయాల్లో తప్పనిసరిగా స్కానింగ్ పరీక్షలు అవసరమవుతుంది. అలాంటి సమయాల్లో పేషెంటుకు స్కానింగు పరీక్ష చేయించుకోవాలని సూచిస్తుంటాం. ఇక్కడ స్కానింగ్ పరికరాలు అందుబాటులో ఉన్నా సిబ్బంది లేక ఇబ్బందిగా ఉంది. ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని కోరాం. – డాక్టర్ జిలానీ, ఇన్‌చార్జి
సూపరింటెండెంట్, జిల్లా ఆసుపత్రి, నంద్యాల
‘స్కానింగ్’ కష్టాలు
‘స్కానింగ్’ కష్టాలు
Comments
Please login to add a commentAdd a comment