సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సూర్యడిపై పరిశోధనలు చేయాలనే కల నెరవేరింది. సూర్యయాన్–1 పేరుతో చేసిన ఆదిత్య –ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ఇస్రో మంచి జోష్ మీదుంది. నిన్న చంద్రయాన్–3, నేడు సూర్యయాన్ ప్రయోగంతో వరుసగా రెండు గ్రహాంతర ప్రయోగాలను విజయవంతం చేసి చరిత్రాత్మక విజయాలను సొంతం చేసుకుంది.
ఈ ప్రయోగంతోనే చంద్రయాన్–4, శుక్రుడిపై ప్రయోగానికి బీజం పడింది. ప్రపంచంలో నాసా ఇప్పటికే సూర్యుడిపై అధ్యయనం చేయడానికి ప్రయోగాలను చేసింది. ఆ తరువాత మొదటిసారి సూర్యుడిపై పరిశోధనలకు శ్రీకారం చుట్టింది. సూర్యుడు అగి్నగోళం కదా! అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోదా! అనే సందేహం చాలామందిలో ఉంది. అందుకే భూమికి 15 లక్షల కిలోమీటర్లు దూరంలోని సూర్యునికి దగ్గరగా ఉన్న లాంగ్రేజియన్ బిందువు 1 వద్ద ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి అ«ధ్యయనం చేయనున్నారు.
సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు కాంతిమండలం (ఫొటోస్పియర్), వర్ణ మండలం (క్రోమోస్పియర్)లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించాలని ఈ ప్రయోగాన్ని నిర్వహించేందుకు పూనుకున్నారు. సూర్యుడి వెలుపలి వలయాన్ని కరోనా అంటారు. సూర్యగోళానికి వేల కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది.
కరోనాలో వేడి పెరిగిపోతుండడానికి కారణం శాస్త్రవేత్తలకు అంతు చిక్కడం లేదు. ఈ అంశంపై ఆదిత్య–ఎల్1 దృష్టి సారించి పరిశోధనలు చేయనుంది. చంద్రుడు, అంగారకుడిపై చేసిన పరిశోధనలు మొదటి ప్రయత్నంలోనే విజయవంతం కావడంతో సూర్యుడిపై కూడా పరిశోధనలు కూడా మొదటి ప్రయత్నంలోనే చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమై ప్రయోగంలో మొదటి ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలో భారత్‌కు తిరుగులేదని మరోమారు నిరూపించారు.
తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రంలోని రెండో ప్రయోగవేదిక నుంచి సూర్యయాన్–1 పేరుతో పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ ద్వారా 1,480 కిలోలు ఆదిత్య –ఎల్1 ప్రయోగాన్ని నిర్వహించి ఇస్రో చరిత్రలోచరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. మొన్న చంద్రయాన్–3 సక్సెస్ జోష్‌లో ఉన్న ఇస్రో శాస్త్రవేత్తలు సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య–ఎల్1 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించి ప్రపంచంలో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో తిరుగులేని దేశంగా మరోమారు నిలిపారు.
సూర్యుడి మీద అధ్యయనం చేసే ప్రయోగం కావడం, కక్ష్య దూరం కొత్తగా ఉండడంతో మిషన్ కంట్రోల్‌రూంలో నిశ్శబ్ద వాతావరణం ఆవరించింది. శుక్రవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 23.40 గంటలపాటు కొనసాగింది. కౌంట్‌డౌన్ ముగిసే సమయం దగ్గర పడింది. కౌంట్‌డౌన్ సమయంలో జీరో పడడమే తరువాయి.. తూర్పువైపున నిప్పులు చెరుగుతున్న భగభగ మండే ఎండను, మబ్బులను చీల్చుకుంటూ ఎరుపు, నారింజ రంగు మంటలను చిమ్ముతూ పీఎస్‌ఎల్‌వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని మోసుకుని నింగివైపునకు దూసుకెళ్లింది.
వెంటనే మిషన్ కంట్రోల్‌రూంలోని శాస్త్రవేత్తలు టెన్షన్‌గా కంప్యూటర్లును ఆపరేట్ చేస్తూ కంటి మీద రెప్ప వాల్చకుండా రాకెట్ గమనాన్ని పరిశీలించారు. నాలుగు దశలతో కూడిన ప్రయోగాన్ని 01.03.31 గంటల వ్యవధిలో పూర్తి చేశారు. 1,480 కిలోల ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని గంటా మూడు నిమిషాల వ్యవధిలో భూమికి దగ్గరగా (పెరిజీ)235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్లు ఎత్తులో ఎసిన్‌ట్రిక్ ఎర్త్ బౌండ్ అర్బిట్(అత్యంత విపరీతమైన కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు.
ఈ ఉపగ్రహం 125 రోజులకు లాంగ్రేజియన్ బిందువు వద్ద ప్రవేశపెట్టి, 12 రోజుల తర్వాత సూర్యుడు సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు–1 వద్ద అధ్యయనం చేసి సూర్యునిపై రహస్యాలను భూమికి చేర్చుతుంది. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో 90వ సారి ప్రయోగాన్ని కూడా విజయవంతంగా నిర్వహించి మరో గ‘ఘన’విజయాన్ని నమోదు చేసుకున్నారు. గ్రహాంతర ప్రయోగాల్లో ఆదిత్య ఎల్1 మిషన్ ఐదో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు.
రాకెట్ వివరాలు
► పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగించారు. మొదటి, మూడో దశలు ఘన ఇంధనంతో.. రెండు, నాలుగు దశలు ద్రవ ఇంధనంతో నిర్వహించారు.
► పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు
► రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైన 1.03.31 గంటల్లో (3,799.52 సెకన్లు) ప్రయోగాన్ని పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment