సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 48 మంది పైలట్లను తొలగిస్తూ రాత్రికి రాత్రి ఆదేశాలు జారీ చేయడం కలకలం సృష్టించింది. కరోనా సంక్షోభం కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ తెలిపింది. సకాలంలో జీత భత్యాలు చెల్లించలేదంటూ జూలై, 2019 న ఈ 48 మంది పైలట్లు రాజీనామా చేశారు. అయితే 6 నెలల నోటీసు పీరియడ్ లో ఈ రాజీనామాలను ఉపసంహరించుకున్నారు. దీనికి అధికారిక ఆమోదం తరువాత ప్రస్తుతం వీరంతా ఎయిర్ బస్ విధుల్లో ఉన్నారు. అయితే గత రాత్రి హఠాత్తుగా తొలగింపు ఆదేశాలివ్వడం ఆందోళన రేపింది. ఇది తెలియని కొంతమంది పెలట్లు ప్రస్తుతం విధుల్లో ఉండటం గమనార్హం.
కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం కార్యకలాపాలు చాలా పరిమితంగా ఉన్నాయి. సమీప భవిష్యత్తులో పెరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో భారీ నష్టాల్లో ఉన్నాం.. ఆర్థిక సామర్థ్యం లేదంటూ ఎయిరిండియా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగాయి. పైలట్ల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలనంటూ ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసీపీఐ) పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ పూరికి, ఎయిరిండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్ కు ఒక లేఖ రాసింది. అక్రమ తొలగింపులపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరింది. మరోవైపు కొందరు పైలట్లు న్యాయం కోరుతూ కోర్టు మెట్లు ఎక్కేందుకు సన్నద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment