
న్యూఢిల్లీ: జీ 20 సదస్సుకు వేదిక అయిన భారత్ మండపం వద్ద ఏర్పాటు చేసిన భారీ నటరాజ ప్రతిమ ప్రాచీన కాలం నుంచీ వస్తున్న భారతీయ కళా నైపుణ్యానికి, ప్రతిభకు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో ఆయన కామెంట్ చేశారు.
అనంత విశ్వ శక్తికి సంకేతమైన నటరాజ విగ్రహం జీ 20 సదస్సు వేదిక వద్ద ప్రధాన ఆకర్షణగా నిలవనుందన్నారు. అష్ట ధాతుమయమైన 27 అడుగుల ఎత్తు, 18 వేల కిలోల ఎత్తుతో నటరాజ ప్రతిమ అందరినీ ఆకట్టుకుంటోంది. దీన్ని తమిళనాడుకు చెందిన ప్రఖ్యాత శిల్పి రాధాకృష్ణన్ బృందం రికార్డు స్థాయిలో కేవలం 7 నెలల్లో రూపొందించింది. ఆయన కుటుంబీకులు చోళుల హయాం నుంచీ, అంటే ఏకంగా 34 తరాలుగా శిల్పులుగా ఉంటూ వస్తున్నారు.