పర్వేజ్ కుటుంబ సభ్యులకు అమిత్‌షా పరామర్శ
శ్రీనగర్: ఉగ్రవాదులతో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లు, ముష్కరుల నుంచి పెరిగిపోతున్న ముప్పు, సాధారణ పౌరుల్ని కాల్చి చంపడం, సరిహద్దుల నుంచి ఉగ్రవాదుల చొరబాట్లతో కశ్మీర్‌లో అస్థిరత నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. కశ్మీర్‌లో భద్రతపై రాజ్‌భవన్‌లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, పోలీసు, ఇతర భద్రతా సంస్థల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. కేంద్ర బలగాలు అన్ని వైపులా మోహరించిన ఉన్నప్పటికీ ఎందుకు ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని షా అధికారుల్ని నిలదీశారు. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకున్నారు.
మైనార్టీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఇటీవల కాలంలో జరిగిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రదాడుల్లో ఐదుగురు బీహార్ కూలీలు సహా మొత్తం 11 మంది సాధారణ పౌరులు కేవలం అక్టోబర్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అమిత్ షా కశ్మీర్‌కు రావడం ఇదే తొలిసారి. మంచు, భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆదివారం జమ్మూలో జరగాల్సిన ర్యాలీ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి.
ఇన్‌స్పెక్టర్ కుటుంబానికి షా పరామర్శ
ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు ఇన్‌స్పెక్టర్ పర్వేజ్ అహ్మద్ కుటుంబాన్ని షా పరామర్శించారు. విమానాశ్రయం నుంచి నేరుగా అమిత్ షా వారి ఇంటికి వెళ్లారు. అహ్మద్ భార్య ఫాతిమా అక్తర్‌కు కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్‌ని అమిత్ షా ఇచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ శివార్లలోని నౌగామ్‌లో నివాసం ఉండే అహ్మద్‌ను జూన్ 22న ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే.
రాష్ట్రహోదా పునరుద్ధరిస్తాం
జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. యూత్ క్లబ్ సభ్యులతో ఆయన ముచ్చటిస్తూ..కశ్మీర్ యువతకి స్నేహహస్తం అందించడానికే తాను వచ్చానని చెప్పారు. ‘ఆ భగవంతుడు ఈ లోయని ఒక స్వర్గంలా మార్చాడు. ప్రకృతి సౌందర్యంతో సర్వాంగ సుందరంగా వెలిగిపోతోంది. మోదీ ఈ లోయ అభివృద్ధిని, శాంతి సుస్థిరతల్ని కోరుకుంటున్నారు. ఇందుకోసం కశ్మీర్ యువత సహకరించాలి. వారి సహకారం కోసమే ఇక్కడికి వచ్చాను’’ అని అమిత్ షా వెల్లడించారు. కేంద్రం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment