సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. 2014 రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని, ఆ విషయాన్ని మోదీ మర్చిపోద్దని సూచించారు. మంగళవారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విదార్థి యువజన ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు మంత్రిని కలిశారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఈ పోరాటానికి తన సంపూర్ణ సహకారం, మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రాన్ని ఆదుకుంటామని విభజన సమయంలో పార్లమెంటు ఉభయ సభల్లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఢిల్లీలోని తెలంగాణభవన్ ఆస్తులు, భూములపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్‌తో భేటీ
రాష్ట్రంలోని పలు రోడ్ల ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలంటూ మంత్రి కోమటిరెడ్డి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతో‹Ùకుమార్‌యాదవ్‌ను కోరారు. నల్లగొండ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు, ఆర్మూరు–మంచిర్యాల రోడ్డు, మల్కాపూర్–విజయవాడ వరకు ఆరు లేన్ల గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకు అనుమతులు ఇవ్వాలని కోమటిరెడ్డి వినతిపత్రాలు సమర్పించారు.
మంత్రి కోమటిరెడ్డికి స్వల్ప అస్వస్థత
సాక్షి, నల్లగొండ ప్రతినిధి: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొంతు సంబంధిత ఇన్‌ఫెక్షన్‌తో ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. స్కానింగ్ చేసిన యశోద ఆస్పత్రి వైద్యులు.. రెండు రోజులు ఆస్పత్రిలో ఉండి చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఎన్నికల సమయంలోనూ ఆయన గొంతునొప్పితో ఇబ్బంది పడ్డారు. ఇటీవల కాలంలో తరచుగా కోమటిరెడ్డి ఢిల్లీ వెళ్లిరావడం, అక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలించకే అస్వస్థతకు లోనైనట్టు తెలిసింది.
అన్నదాతల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము
తొలిరోజు ఎకరాలోపు రైతులకు అందజేత!
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు సొమ్ము అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ప్రారంభమైంది. ఎకరంలోపు భూమి ఉన్న దాదాపు 22 లక్షలమంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో సుమారు రూ.640 కోట్ల మేర డబ్బులను మంగళవారం జమ చేసినట్టు వ్యవసాయశాఖ వర్గాలు అనధికారికంగా తెలిపాయి.
వానాకాలం సీజన్ మాదిరిగానే యాసంగిలో కూడా అదే పద్ధతిలో నగదును రైతులకు అందజేసినట్లు అధికారులు తెలిపారు. కాగా, ప్రభుత్వం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని వ్యవసాయ అధికారులు అంటున్నారు. వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పేషీ కూడా రైతుబంధు సొమ్ము సమాచారం వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment