
న్యూఢిల్లీ: చైనాతో సరిహద్దు వెంబడి అంగుళం భూ భాగాన్ని కూడా పొరుగు దేశానికి వదలబోమని ఆర్మీ కొత్త చీఫ్ జనరల్ మనోజ్ పాండే స్పష్టం చేశారు. యథాతథ స్థితిని మార్చేందుకు జరిగే ప్రయత్నాలను దీటుగా తిప్పికొడతామన్నారు. దేశం ముందున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యున్నత స్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సంసిద్ధతకు ప్రాధాన్యమిస్తానన్నారు.
ఆదివారం సౌత్‌బ్లాక్‌లో గౌరవవందనం స్వీకరించిన అనంతరం ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్‌తో కలిసి జనరల్ పాండే మీడియాతో మాట్లాడారు. ‘ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతుండటంతో మనకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అందుకే, సమకాలీన, భవిష్యత్ సంక్షోభాలను తిప్పికొట్టేందుకు అత్యున్నతస్థాయి ప్రమాణాలతో కూడిన కార్యాచరణ సంసిద్ధతే నా ప్రథమ ప్రాధాన్యం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ కలిసికట్టుగా ఎటువంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి.
రక్షణ విషయంలో స్వావలంబన సాధించడంతోపాటు ఆర్మీ కార్యాచరణ సన్నద్ధతను మరింత విస్తృతం చేసేందుకు సంస్కరణలు, పునరి్నర్మాణంపై దృష్టి సారిస్తాను’ అన్నారు. ప్రస్తుత త్రివిధ దళాధిపతులు ముగ్గురూ నేషనల్ డిఫెన్స్ అకాడమీ 61వ బ్యాచ్‌లో కలిసి చదువుకున్నవాళ్లే కావడం విశేషం. నేవీ, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లు తన క్లాస్‌మేట్లేనని జనరల్ పాండే అన్నారు. త్రివిధ దళాల సమష్టి కార్యాచరణకు, సహకారానికి ఇది శుభారంభమన్నారు.
ఇది కూడా చదవండి: అప్పుడే మోదీకి సపోర్ట్ చేశాం: సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు