అయోధ్య/న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం కీలక ఘట్టం ముగిసింది. రామ్‌లల్లా విగ్రహాన్ని క్రేన్ సాయంతో భవ్యమందిరంలోని గర్భగుడిలోకి చేర్చారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణలు, భక్తుల జయజయ ధ్వానాల మధ్య ప్రధాన వేదికపై ప్రతిష్టించారు. ఈ సందర్భంగా ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అత్యంత కీలకమైన ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగాల్సి ఉంది. గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని వస్త్రంతో కప్పి ఉంచారు. బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ జవదేవకర్ సైతం ఎక్స్ ఖతాలో ఆ ఫొటోను ఉంచారు.
सियावर रामचंद्र की जय।🙏
— Prakash Javadekar (@PrakashJavdekar) January 18, 2024
प्रतिक्षा 22 जनवरी 2024..
जय श्रीराम 🚩#RamMandirPranPratishta #RamLalla #RamMandir #RamMandirAyodhya #JaiShreeRam #ShriRam #Ayodhya #राम pic.twitter.com/0c6vO6ueJO
మొబైల్ ఫోన్లు, కెమెరాలతో ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. ఆలయ ప్రాంగణంలో ఉత్తరప్రదేశ్ ప్రత్యేక భద్రతా బలగాలు మోహరించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనధికార వ్యక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ప్రాణప్రతిష్ట తర్వాత బాలరాముడికి నిత్యం ఐదుసార్లు ప్రత్యేక హారతి ఇస్తారు. విగ్రహంపై దుస్తులను ప్రతిరోజూ మారుస్తారు. మొదటి, చివరి హారతి సందర్భంగా రాముడు ప్రత్యేక దుస్తుల్లో దర్శనమిస్తాడు.
నిర్విఘ్నంగా కొనసాగుతున్న క్రతువులు
ప్రత్యేక క్రతువులు నిరి్వఘ్నంగా కొనసాగుతున్నాయి. అయోధ్యలో మూడో రోజు గురువారం ఆచార్యులు ఆలయ ప్రాంగణంలో గణేశ్ పూజ, వరుణ పూజ, వాస్తు పూజ శా్రస్తోక్తంగా నిర్వహించారు. జలదివస్‌లో భాగంగా రామ్‌లల్లా విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు.
రామ్‌లల్లా విశిష్టతలివే..
► అయోధ్య రామాలయంలో ప్రతిష్టించబోయే బాలరాముడి విగ్రహం ఎత్తు 51 అంగుళాలు.
► కృష్ణ శిల(నల్ల రాయి) నుంచి ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కారు.
► రామ్‌లల్లాను చెక్కిన శిల బరువు దాదాపు 200 కిలోలు.
► ఐదేళ్ల బాలుడి రూపంలో రామ్‌లల్లా విగ్రహాన్ని రూపొందించారు.
► గర్భాలయంలో నిల్చున్న రూపంలోనే రామ్‌లల్లా దర్శనమిస్తాడు.
► విగ్రహ ప్రాణప్రతిష్ట ఈ నెల 22వ తేదీన.. సోమవారం మధ్యాహ్నం 12.20 గంట నుంచి ఒంటి గంట మధ్య అభిజిత్ ముహూర్తంలో జరుగుతుంది.
► ప్రాణప్రతిష్ట సందర్భంగా గర్భగుడిలోకి కొందరికే ప్రవేశం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అయోధ్య రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు మహంత్ నృత్యగోపాల్ మహారాజ్ మాత్రమే గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ట్రస్టీలు ‘గర్భగృహం’ అని పిలిచే పవిత్ర ప్రాంతంలో ఆసీనులవుతారు.
► ఆలయ ప్రాణప్రతిష్టకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధాన యజమాని(కర్త)గావ్యవహరిస్తారు.
► ఈ నెల 23వ తేదీ నుంచి గర్భాలయంలో బాలరాముడిని సామాన్య భక్తులు దర్శించుకోవచ్చు.
అయోధ్య ఆలయంపై పోస్టల్ స్టాంప్‌లు విడుదల
అయోధ్య భవ్య రామమందిరానికి సంబంధించిన పోస్టల్ స్టాంప్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం విడుదల చేశారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు శ్రీరాముడిపై జారీ చేసిన స్టాంప్‌లతో కూడిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఇవి కేవలం కాగితం ముక్కలు కాదని, చరిత్రాత్మక సంఘటనలను భవిష్యత్తు తరాలకు తెలియజేయడానికి ఉపయోగపడే మాధ్యమాలు అని చెప్పారు.
చరిత్ర పుస్తకాలకు, పురాణ గాథలకు, గొప్ప ఆలోచనలకు సూక్ష్మరూపాలు అని తెలిపారు. మోదీ మొత్తం ఆరు రకాల స్టాంప్‌లను మోదీ విడుదల చేశారు. అయోధ్య రామాలయం, వినాయకుడు, హనుమంతుడు, జటాయు, శబరి మాత, కేవట్ రాజ్‌పై వీటిని ముద్రించారు. 48 పేజీల స్టాంప్ బుక్‌ను మోదీ విడుదల చేశారు. అమెరికా, న్యూజిలాండ్, సింగపూర్, కెనడా, కాంబోడియా తదితర దేశాలు, ఐక్యరాజ్యసమితి వంటి సంస్థలు ముద్రించిన శ్రీరాముడి స్టాంప్‌ల చిత్రాలు ఈ పుస్తకంలో ఉన్నాయి.
రాముడు, సీత, రామా యణం అనేవి సరిహద్దులకు, కాలానికి, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతం అని ప్రధాని మోదీ చెప్పారు. రామాయణం, రాముడి వ్యక్తిత్వం భూమి పై పర్వతాలు, నదులు ఉన్నంత కాలం ప్రజలను ప్రభావితం చేస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. విదేశాలు సైతం రాముడిపై పోస్టల్ స్టాంప్‌లు ముద్రించాయని, వేర్వేరు నాగరికతలను రాముడు ప్రభావితం చేశాడని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భిన్న సంస్కృతుల ప్రజలకు రాముడు ఆరాధ్య దైవంగా మారాడని వివరించారు.
ఫిరోజాబాద్ నుంచి 10 వేల గాజులు, బ్రేస్‌లెట్లు
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ నుంచి 10,000కుపైగా ప్రత్యేక గాజులు, బ్రేస్‌లెట్లను గురువారం అయోధ్యకు చేర్చారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అందజేశారు. మహిళలు, పురుషులు చేతులకు ధరించే గాజులు, బ్రేస్‌లెట్ల తయారీకి ఫిరోజాబాద్ ఎంతో పేరుగాంచింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుక కోసం ఫిరోజాబాద్ వ్యాపారులు రాముడు, సీత, హనుమంతుడి చిత్రాల తో కూడిన 10 వేల గాజులు, బ్రేస్‌లెట్లను ప్రత్యేకంగా తయారు చేయించారు. ప్రాణప్రతిష్ట వేడుక తర్వాత వీటిని ట్రస్టు ఆధ్వర్యంలో మూడు రోజులపాటు భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తారు. ఈ గాజులను పెళ్లిలో నూతన వధువులు ధరించాలని ఫిరోజాబాద్
వ్యాపారులు సూచించారు.
దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం
అయోధ్యలో ప్రాణప్రతిష్ట వేడుక దూరదర్శన్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ నెల 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. డీడీ న్యూస్‌తోపాటు డీడీ జాతీయ చానళ్లన్నింటిలో లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. దూరదర్శన్ సౌజన్యంతో ప్రైవేట్ చానళ్లలోనూ ప్రసారమవుతుంది. అయోధ్యలో 40 కెమెరాలను దూరదర్శన్ ఏర్పాటు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లోనూ ప్రత్యక్ష ప్రసారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
22న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు ‘సగం రోజు సెలవు’
దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కేంద్ర పారిశ్రామిక సంస్థలకు ఈ నెల 22వ తేదీన సగం రోజు సెలవు ప్రకటించారు. అయోధ్యలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రాణప్రతిష్టకు సంబంధించిన వేడుకల్లో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా వారి విజ్ఞప్తి మేరకు కార్యాలయాలకు సగం రోజు సెలవు ఇస్తున్నారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 22న మధ్యాహ్నం 02.30 గంటల వరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు, బీమా సంస్థలకూ 22న సగం రోజు సెలవే.
వాతావరణ శాఖ వెబ్‌పేజీ ప్రారంభం
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుకకు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. అయోధ్య నగరంతోపాటు పరిసర ప్రాంతాల వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతలు, తేమ, చలి తీవ్రత వంటి సమాచారం ఎప్పటికప్పుడు తెలియజేయడానికి భారత వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం ప్రత్యేక వెబ్‌పేజీను ప్రారంభించింది. హిందీ, ఇంగ్లి‹Ù, ఉర్దూ, చైనీస్, ఫ్రెంచ్, స్పానిష్ తదితర భాషల్లో ఇందులో సమాచారం అందుబాటులో ఉంటుంది.
ఉజ్జయిని నుంచి 5 లక్షల లడ్డూలు
అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం కోసం మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో 5 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. శుక్రవారం వీటిని నాలుగు వాహనాల్లో అయోధ్యకు పంపించనున్నట్లు ఆలయ వర్గాలు తెలియజేశాయి. ఈ నెల 22న ప్రాణప్రతిష్ట సందర్భంగా వీటిని భక్తులకు పంపిణీ చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment