సుభాస్ చంద్రబోస్‌తో ‘రాణి ఝాన్సీ రెజిమెంట్’ సారథి కెప్టెన్ లక్ష్మీ సెహెగల్
నేను నమ్ముతున్నాను.. మహిళా భాగస్వామ్యం కూడా ఉంటే త్వరగా స్వాతంత్య్రం సిద్ధిస్తుందని. నేను నమ్ముతున్నాను.. మహిళలూ కదనరంగంలోకి దుమికితే.. భారతదేశంలో అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్ కు అందుతుందని.. ఎనభై ఏళ్ల క్రితమే ఏ బలాలు, దళాలు లేని కాలంలో స్వాతంత్య్ర సంగ్రామానికి మహిళల్ని ఏ ధైర్యంతో ఆహ్వానించారు సుభాస్‌చంద్రబోస్?! ధైర్యంతో కాదు. మహిళా శక్తిపై ఉన్న నమ్మకంతో! ఆ నమ్మకంతోనే బోస్ ‘రాణీ ఝాన్సీ’ మహిళా రెజిమెంట్‌ను స్థాపించి, వారి తుపాకులను బ్రిటిష్‌వారి పైకి ఎక్కుపెట్టించారు!
1943 జూలై 9, సింగపూర్.. బోస్ మాట్లాడుతున్నాడు.. సుభాస్ చంద్రబోస్! ఎదురుగా భారతీయులు.. అరవై వేల మంది! ఇల్లొదిలి, దేశం వదలి తనెందుకు వచ్చిందీ చెప్పాడు. అయితే అది కాదు అతడు చెప్పబోతున్నదని అక్కడి వారికి అర్థమైపోయింది. ఇంకేదో చెప్పబోతున్నాడు. ఏంటది? ‘‘మహిళలు కూడా తుపాకులు అందుకోవాలి’’ అన్నాడు బోస్. ఒక్కసారిగా నిశ్శబ్దం! ‘‘వాళ్లొచ్చి ఏం చేస్తారు బోస్.. భారం అవుతారు ఆజాద్ హింద్ ఫౌజ్‌కి’’.. ఎవరో అన్నారు.
ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ – ఐఎన్‌ఎ) .. బోస్ నిర్మించిన సైనిక దళం. గొరిల్లా, ఇన్‌ఫాంట్రీ, స్పెషల్ ఆపరేషన్స్.. వెరీ డేంజరస్! ఐఎన్‌ఎ అలికిడి అయితే చాలు.. బ్రిటిష్ ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. అప్పటికి ఏడాదైంది బోస్ ఐఎన్‌ఎ ని తయారుచేసి. అందులోకే ఇప్పుడు మహిళల్ని రమ్మంటున్నాడు. ‘‘ఒంట్లో సత్తువ ఉన్న ప్రతి ఒక్కరూ.. ఇంట్లో దూరిన శత్రువుని తరిమికొట్టడానికి సైన్యంలోకి రావాలి’’ అన్నాడు బోస్. ‘‘ఏం చేస్తారు బోస్.. మహిళలు సైన్యంలోకి వచ్చి?’’ మళ్లీ అదే ప్రశ్న. ఆ ప్రశ్నకు బోస్ గర్జించాడు.
ఎవరూ చేతుల్లేపలేదు!
‘‘ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసిందో అదే చేస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఎలా ఖడ్గాన్ని తిప్పిందో అలాగే ఖడ్గాన్ని తిప్పుతారు. తిరుగు బాటుకు, స్వాతంత్య్ర సంగ్రామానికి అప్పుడున్నది ఒక్క లక్ష్మీబాయే. ఇప్పుడు ప్రతి మహిళా ఒక లక్ష్మీబాయి. నేను నమ్ముతున్నాను.. మహిళా భాగస్వామ్యం కూడా ఉంటే త్వరగా స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. నేను నమ్ముతున్నాను.. మహిళలూ కదనరంగంలోకి దుమికితే.. భారతదేశంలో అణువణువునా స్వాతంత్య్ర కాంక్ష రగులుతోందన్న సంకేతం బ్రిటన్ కు అందుతుంది..’’. బోస్ ప్రసంగం ముగించాడు. ముగిస్తూ, చెయ్యి ముందుకు చాపి.. ప్రమాణం చేస్తున్నట్లుగా అన్నాడు. ‘‘మన మహిళా దళం పేరు.. ‘రాణీ ఝాన్సీ రెజిమెంట్’ అన్నాడు.
ఎవరూ చేతుల్లేప లేదు!‘‘ఇక స్వాతంత్య్రం వచ్చినట్లే’’.. ఎవరో అన్నారు. ‘అవునవును’.. ఇంకో గొంతు. మరికొన్ని వంత గొంతుకలు. మూడ్రోజులు గడిచాయి. చప్పుడు లేదు. నాలుగో రోజు సింగపూర్‌లోనే.. ‘ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్’ (ఐఐఎల్) మీటింగ్ జరుగుతోంది. ఐఐఎల్ మహిళా విభాగం మీటింగ్ అది. అక్కడికి వెళ్లాడు బోస్.
‘నా పేరు బోస్.. !’
ఇండియా బయట ఉండి, ఇండియన్ ఇండిపెండెట్స్ కోసం పోరాడుతున్న భారతీయులంతా కలిసి పెట్టుకున్న రాజకీయపార్టీ ఐఐఎల్.‘‘నా పేరు బోస్. మీలాగే భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న ఒక సైనికుడిని’’ అన్నాడు బోస్. మీటింగ్‌లోని మహిళలు కొందరు సంభ్రమంగా చూశారు. ‘మీలాగే’ అన్న మాట.. వారిలో ఉత్తేజాన్ని నింపింది. ‘‘మీతో కలిసి బ్రిటిష్ వాళ్లపై పోరాటం చేయాలనుకుంటున్నాను’’ అన్నాడు బోస్.
బోస్‌తో కలిసి పోరాడాలని అనుకుంటారు ఎవరైనా. కానీ బోసే అంటున్నాడు ‘నేను మీతో కలిసి పోరాడతాను’ అని! ఆశ్చర్యంగా కళ్లింత చేసి చూశారు మహిళలు. సమావేశంలో డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ ఉన్నారు. సింగపూర్‌లో ఐఐఎల్ మహిళా విభాగంలో ఆమెది ముఖ్య పాత్ర. ఆ సమావేశంలోనే.. బోస్‌కి మహిళలతో ‘గార్డ్ ఆఫ్ ఆనర్’ ఇప్పించాలన్న నిర్ణయం జరిగింది. అంటే సైనిక వందనం!
ఎక్కడ దొరుకుతారు?!
సైనిక వందనం ఇప్పించేందుకు మహిళలైతే ఉన్నారు. మహిళా సైనికులు ఎక్కడ దొరుకుతారు.. ‘గార్డ్ ఆఫ్ ఆనర్’కి?! కష్టపడి ఓ ఇరవై మంది సాధారణ మహిళల్ని ఒప్పించగలిగారు. బోస్ ఐఎ¯Œ ఎ దళం నుంచి లీ–ఎన్‌ఫీల్డ్ 303 రైఫిల్స్ తెప్పించారు. వాటిని ఎలా పట్టుకోవాలో, ఎలా వందన సమర్పణ చేయాలో ఆ ఇరవై మందికి అప్పటికప్పుడు నేర్పించారు. యూనిఫారాల్లేవు. చీరల వస్త్రధారణలోనే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు. వందన సమర్పణ ముగిసింది. బోస్ ప్రసంగం మొదలైంది. ‘‘స్వాతంత్య్రం కోసం దశాబ్దాలుగా మగాళ్లకు దీటుగా మీరూ ముందుకు నడుస్తున్నారు. నాకనిపిస్తున్నది ఏమిటంటే.. ముందుకు నడవడమే కాదు, ముందుకు నడిపించగలరు కూడా మీరు’’. ఆ ఒక్కమాట చాలదా మహిళలు తుపాకీని భుజానికెత్తుకోడానికి. ఎత్తుకున్నారు.
ఖిన్నుడైన జనరల్
కానీ, అదంత తేలిగ్గా ఏమీ జరగలేదు. ఆడవాళ్లెందుకు ఆజాద్ హింద్ ఫౌజ్‌లోకి అనే ప్రశ్న మళ్లీ వచ్చింది. బోస్‌కి సైనిక వందనం చేసిన మహిళల్లో డాక్టర్ నసీరా కయానీ అనే డాక్టర్ కూడా ఉన్నారు. రైఫిల్‌ని ఎత్తిపట్టుకున్న ఆ గ్రూపులో ఉన్న నసీరాను చూసి ఆజాద్ హింద్ ఫౌజ్ కు జనరల్‌గా ఉన్న మొహమ్మద్ జమాన్ కయానీ ఖిన్నుడయ్యాడు. తన భార్యేమిటీ, అకస్మాత్తుగా ఇక్కడ ప్రత్యక్షం అయిందేమిటీ? అని ఆశ్చర్యపోయాడు.
ఇంటికి వెళ్లాక నసీరాను కోప్పడ్డాడు. ‘‘డాక్టర్ లక్ష్మీ స్వామినాథన్ కాలేజ్‌లో నా క్లాస్‌మేట్. తను రమ్మంటే వెళ్లాను’ అని భర్తకు చెప్పారు నసీరా. ఆర్‌జెఆర్ (రాణి ఝాన్సీ రెజిమెంట్) లో చేరదామని వెళ్లి కూడా, భర్త వద్దనడంతో ఆమె ఆగిపోయారు. పైస్థాయిలోనే ఇలా ఉంటే, కింది స్థాయిలో ఇంట్లో మగాళ్లు మహిళల్ని సైన్యంలోకి వెళ్లనిస్తారా? అయినా ఆర్‌జెఆర్ నిలబడింది. నిలదొక్కుకుంది. కలబడింది. బలపడింది.
కదిలివచ్చిన కొద్దిపాటి మహిళలతోనే నేతాజీ మహిళా సైన్యం 1943 అక్టోబర్ నుంచి 1945 మే వరకు ఉరుములా, మెరుపులా వెయ్యి మంది సైనికులతో ఉనికిలో ఉంది. కెప్టెన్ లక్ష్మీ సెహెగల్ (లక్ష్మీ స్వామినాథనే లక్ష్మీ సెహెగల్) ఈ దళాన్ని నడిపించారు. 1945 అక్టోబర్‌లో ప్రపంచ యుద్ధం పూర్తయింది. అంతకు రెండు నెలల ముందే ఆగస్టులో సుభాస్ చంద్రబోస్ అదృశ్యమయ్యారు. ఆ అదృశ్యశక్తి మహిళల్లో పోరాట పటిమకు శక్తినిస్తూ ఎప్పుడూ నడిపిస్తూనే ఉంటుంది.
– సుభాస్ చంద్రబోస్
Comments
Please login to add a commentAdd a comment