‘జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!’ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌! | Bengaluru Techie Wife Denies Speculations About Harassing Her Husband | Sakshi
Sakshi News home page

‘జైలుకైనా పంపండి.. ఇంటికి మాత్రం వెళ్లను!’ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌!

Published Tue, Aug 20 2024 12:56 PM | Last Updated on Tue, Aug 20 2024 12:56 PM

Bengaluru Techie Wife Denies Speculations About Harassing Her Husband

తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే జైలుకైనా పంపండని, ఇంటికి మాత్రం వెళ్లబోనని తేల్చి చెప్పిన 34 ఏళ్ల టెక్కీ విపిన్‌ గుప్తా ఎపిసోడ్‌పై ఆయన భార్య శ్రీపర్ణ దత్త స్పందించారు. 

తాను భర్తను వేధించానంటూ వస్తున్న ఊహాగానాలను కొట్టిపారేశారు. భార్య వేధిస్తుంది కాబట్టే ఆమె నుంచి తప్పించుకునేందుకు భర్త తిరుగుతున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖండించారు.  తన భర్త గత కొంత కాలంగా కెరియర్‌ గురించి ఆందోళనకు గురైనట్లు చెప్పారు.  

గతంలో తన భర్తపై మిస్సింగ్ కేసు వేసిన శ్రీపర్ణ దత్తా జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నా భర్త విపిన్ రెండుసార్లు ఉద్యోగం  కోల్పోయాడు. దీంతో భవిష్యత్‌ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు తండ్రికి అనారోగ్య సమస్యలు, ఆర్ధిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. చికిత్సకు డబ్బు అవసరం కావడంతో మానసికంగా కుంగిపోయాడు. ఉపశమనం పొందేందుకు తిరుమల దర్శనం అనంతరం నోయిడా వెళ్లినట్లు చెప్పారు.  

అన్నీ అవాస్తవాలే
ఈ సందర్భంగా తాను విపిన్‌ను వేధిస్తున్నానంటూ వచ్చిన ఆరోపణల్ని కొట్టిపారేశారు. ‘నేను నా భర్తను వేధిస్తే.. ఆయన ఆచూకీ కోసం సోషల్‌ మీడియాను ఎందుకు ఆశ్రయిస్తాను. నేను నా భర్తను ఎప్పుడూ వేధించలేదు. అదే జరిగితే, అతనిని వెతకాలని పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేస్తాను? ఆచూకి కోసం సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు ఎందుకు పెడతాను’ అని ప్రశ్నించారు. మానసికంగా కృంగిపోయాడు కాబట్టే భర్తను పునరావాస కేంద్రానికి పంపించినట్లు ఆమె చెప్పారు.

బెదిరింపులు ఎక్కువయ్యాయ్‌
తన భర్త దొరికిన తర్వాత కూడా తనకు బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయని వాపోయారు శ్రీపర్ణ దత్త. నా భర్తను కిడ్నాప్ చేశామంటూ పలువురు డబ్బుల్ని డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశానని, తనకు సైబర్‌ నేరస్తులు మెసేజ్‌లు పంపినట్లు వెల్లడించారు.  

భార్య పోరు పడలేకే
గతవారం బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహించే ఐటీ ఉద్యోగి విపిన్‌ గుప్త ఇంటి నుంచి నోయిడా వెళ్లాడు. అయితే విపిన్‌ జాడకోసం ఆయన భార్య శ్రీపర్ణ దత్తా పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యల్ని చేపట్టారు. చివరికి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరుకు రప్పించగా, ఇంటికి వెళ్లేందుకు మాత్రం ఒప్పుకోలేదు. తనపై ఏ కేసు అయినా పెట్టుకోవాలని, అవసరమైతే  జైలుకైనా పంపండని పోలీసుల్ని కోరాడు. అయితే పోలీసులు విపిన్‌ను బుజ్జగించడంతో కష్టం మీద ఇంటికి వెళ్లేందుకు ఒప్పుకున్నాడు. భార్యే విపిన్‌ మానసిక సమస్యకు చికిత్స ఇప్పించేందుకు పునరావస కేంద్రానికి పంపించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement