ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడింది.
అసలైన శివసేనను గుర్తించే అధికారం ఎన్నికల సంఘానికి ఉంటుందని సుప్రీం కోర్టును ఆశ్రయించింది షిండే వర్గం. అయితే.. గుర్తింపు అధికారం ఇవ్వకుండా ఈసీని అడ్డుకోవాలంటూ మరో పిటిషన్ వేసింది థాక్రే వర్గం. ఈ పిటిషన్ల విచారణకై సుప్రీం కోర్టు ప్రత్యేకంగా ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో.. ఇరు పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం ఇవాళ షిండే వర్గానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అసలైన శివసేనను గుర్తించే అధికారం ఎన్నిలక సంఘానికి ఉంటుందని, దానిని అడ్డుకునే అధికారం తమకు లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఉద్దవ్ థాక్రే పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.
ఆగష్టు 23న.. ఉద్దవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాలు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు బదిలీ చేసింది. పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యేల అనర్హత.. తదితర రాజ్యాంగ బద్ధమైన ప్రశ్నల నడుమ ఆ పని చేసింది. అంతేకాదు స్పీకర్,గవర్నర్, న్యాయ సమీక్షల విచక్షణ అధికారాన్ని ఆ పిటిషన్లు ప్రశ్నించాయి కూడా.
ఏక్‌నాథ్ షిండేకు విధేయులైన ఎమ్మెల్యేలు మరో రాజకీయ పార్టీలో విలీనం చేయడం ద్వారానే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత వేటు పడకుండా ఉండవచ్చని థాకరే వర్గం కోర్టుకు తెలిపింది. సొంత పార్టీ విశ్వాసం కోల్పోయిన నాయకుడికి ఫిరాయింపుల నిరోధక చట్టం ఆయుధంగా మారదని షిండే టీమ్ వాదించింది.
ఇదీ చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష బరి నుంచి ఆయన తప్పుకోలేదు!
Comments
Please login to add a commentAdd a comment