మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం | Bill to Parliament soon on human trafficking | Sakshi
Sakshi News home page

మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Published Fri, Jul 9 2021 6:55 AM | Last Updated on Fri, Jul 9 2021 6:55 AM

Bill to Parliament soon on human trafficking - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్రం నూతన చట్టాన్ని తీసుకురానుంది. ఈ బిల్లుపై ముసాయిదా విడుదల చేసిన కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ భాగస్వాముల నుంచి సూచనలు సలహాలు కోరింది. 2018లో ముసాయిదా బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినప్పటికీ రాజ్యసభలో ప్రవేశపెట్టలేదు. ఆ సమయంలో లేవనెత్తిన ఆందోళనలకు నూతన ముసాయిదాలో పరిష్కారం చూపారని నిపుణులు చెబుతున్నారు.

భాగస్వాముల నుంచి సూచనలు సలహాలు వచ్చిన అనంతరం కేంద్ర మంత్రివర్గానికి ఆపై పార్లమెంటులోనూ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. మానవ అక్రమ రవాణా చేసే వారికి పదేళ్ల వరకూ జైలు శిక్ష పడేలా కేంద్రం ఈ చట్టాన్ని రూపొందించింది. బాధితులకు పునరావాస చర్యలు ఏ విధంగా తీసుకోవాలో కూడా చట్టం స్పష్టత ఇచ్చింది. చట్టం ప్రకారం నిందితులను దర్యాప్తు చేయడానికిప్రత్యేక ఏజెన్సీనికేంద్రం ఏర్పాటు చేయాలని పేర్కొంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించి గెజిట్‌ నోటిఫికేషన్‌ ద్వారా ప్రతి జిల్లాలోనూ సెషన్స్‌ కోర్టులను ప్రత్యేక కోర్టుగా పరిగణించాలి.

గెజిటెడ్‌ అధికారి స్థాయి పోలీసు అధికారిని దర్యాప్తు అధికారిగా నియమించాలి. చట్టం అమలుకు ప్రభుత్వాలు యాంటీ ట్రాఫికింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలి. దీన్ని బాధితుల పునరావాసానికి వినియోగించాలి. బాధితులు వేరే జిల్లా,రాష్ట్రానికి చెందిన వారైతే మెరుగైన భద్రత కోసం జిల్లా కమిటీ వారిని అవసరమైతే సొంత ప్రాంతానికి పంపొచ్చు. బాధితులు ఇతర దేశానికి చెందిన వారైతే ఆ సమయంలో ఉన్న చట్టాలు అనుసరించి రాష్ట్ర కమిటీ వారిని వారి దేశానికి పంపొచ్చు. చట్టం అమలుకు సంబంధించి చట్టానికి లోబడి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజిట్‌ ద్వారా నిబంధనలు పేర్కొనాలి. అనంతరం రాష్ట్రంలోని ఉభయసభల్లోనూ ఆమోదం పొందాలి.  

డిస్ట్రిక్ట్‌ యాంటీ ట్రాఫికింగ్‌ కమిటీ  
చైర్‌పర్సన్‌: జిల్లా కలెక్టర్‌
సభ్యుడు/సభ్యురాలు: ముగ్గురిలో ఇద్దరు సామాజిక కార్యకర్తలు. వీరిలో మహిళ సభ్యురాలిని జిల్లా న్యాయమూర్తి నియమించాలి. జిల్లా న్యాయ సేవల అథారిటీ నుంచి ఒకరిని జిల్లా న్యాయమూర్తి నామినేట్‌ చేయాలి. సామాజిక న్యాయ లేదా మహిళ శిశు అభివృద్ధి విభాగం నుంచి జిల్లా అధికారి సభ్య కార్యదర్శిగా ఉంటారు. ప్రతి నెలా కమిటీ సమావేశం కావాలి.

స్టేట్‌ యాంటీ ట్రాఫికింగ్‌ కమిటీ  
చైర్‌పర్సన్‌: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
సభ్యులు: ఎనిమిది మంది. మహిళ, శిశు అభివృద్ధి, హోం, కార్మిక, ఆరోగ్య విభాగాల కార్యదర్శులు డీజీపీ, రాష్ట్ర న్యాయసేవల అథారిటీ కార్యదర్శిలతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూచించిన ఇద్దరు సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు.  

సెంట్రల్‌ యాంటీ ట్రాఫికింగ్‌ అడ్వైజరీ బోర్డు
మహిళ, శిశు అభివృద్ధి శాఖ కార్యదర్శి అధ్యక్షతన ఈ బోర్డు ఏర్పాటు చేయాలి. చట్టం అమలును ఈ బోర్డు పర్యవేక్షించాలి.  
రక్షణ గృహాలు: బాధితులకు తక్షణ సహాయం అందించడానికి ప్రభుత్వం నేరుగా లేదా స్వచ్ఛంద సంస్థల ద్వారా రక్షణ గృహాలు ఏర్పాటు చేయాలి. బాధితులకు నివాసం, ఆహారం, దుస్తులు, కౌన్సిలింగ్, ఆరోగ్య రక్షణ ఈ గృహాల్లో కల్పించాలి.  
ప్రత్యేక గృహాలు: దీర్ఘకాలంగా బాధితులకు పునరావాసం కల్పించడానికి జిల్లాకి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రత్యేక గృహాలు వీరి కోసం ఏర్పాటు చేయాలి. రక్షణ, ప్రత్యేక గృహాలను చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయాలి. బాధితులకు ప్రత్యేంగా లైంగిక దాడులకు గురైన మహిళలకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక పథకాలు తీసుకురావాలి.

నేరం.. శిక్ష
► బాధితులకు ఆశ్రయంకల్పించే విషయంలో రక్షణ, ప్రత్యేక గృహాల ఇన్‌ఛార్జి నిబంధనలు ఉల్లంఘిస్తే ఏడాదిపాటు జైలు, రూ.లక్ష తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు.  
► చట్టం ప్రకారం బాధితులు, సాక్షుల పేర్లు, ఫొటోలు ఏ మాధ్యమం ద్వారానైనా ప్రచురించిన ప్రసారం చేసినా చర్యలు తీసుకుంటారు. బాధ్యులకు ఆరు నెలల వరకూ జైలు లేదా రూ.లక్షల వరకు జరిమానా లేదా రెండింటిని విధిస్తారు.
► అక్రమ రవాణా చేయడానికి మాదకద్రవ్యాలు, మద్యం, సైకోట్రోపిక్‌ పదార్ధాలను నిందితులు వినియోగించినట్లు రుజువైతే పదేళ్లు వరకూ జైలు, రూ.లక్ష తక్కువ కాకుండా జరిమానా విధిస్తారు. రసాయనాలు, హర్మోన్ల ఇంజక్షన్లు నిందితులు ఉపయోగించినట్లు తేలితే పదేళ్ల వరకూ జైలు, రూ.లక్ష తక్కువకాకుండా జరిమానా విధిస్తారు.  
► ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించినట్‌లైతే వారికి మూడు నెలల వరకూ జైలు, రూ.20 వేల వరకూ జరిమానా లేదారెండు విధించొచ్చు.  
► నిందితులు బెయిల్‌ లేదా సొంత పూచీకత్తుపై విడుదల అవుతుంటే స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దాన్ని అడ్డుకోవచ్చు. ఈ సమయంలో బెయిలు ఇస్తే నిందితుడు ఎలాంటి నేరానికి పాల్పడే అవకాశం లేదని కోర్టు నమ్మితే బెయిలు ఇవ్వొచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement