
బెంగళూరు: కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప నివాసం, కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. శివమొగ్గ జిల్లా షికారిపురలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బీజేపీ ప్రభుత్వం ఎస్సీ కోటాలో అంతర్గత రిజర్వేషన్లు తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ బంజారా, భోవి సామాజిక వర్గాలకు చెందిన వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టారు. ఈక్రమంలోనే రాళ్ల దాడి జరిగింది. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీ ఛార్జ్ చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
కర్ణాటక ఎస్సీ రిజర్వేషన్లలో మొన్నటివరకు బంజారాలు అధిక ప్రయోజనం పొందేవారు. అయితే సీఎం బసవరాజ్ బొమ్మై సర్కార్.. కొత్తగా ఎస్సీ రిజర్వేషన్లలో కోటాలు తీసుకొచ్చింది. ఉపకులాలుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేస్తోంది. దీంతో గతంలో ఎస్సీ రిజర్వేషన్లలో 17 శాతం వరకు లబ్ధిపొందే బంజారా కమ్యూనిటీ ఇప్పుడు 4.5 శాతానికే పరిమితం అయింది. ఈ నేపథ్యంలోనే తమకు అన్యాయం జరుగుతోందని వారు యడియూరప్ప నివాసం ఎదుట ఆందోళనలు చేపట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది.
చదవండి: సావర్కర్ వంటి వ్యక్తులు ఏం చేశారో తెలుసా!కేంద్రమంత్రి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment