న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ చేసింది. సీబీఐ అరెస్టును సవాల్ చేయడంతోపాటు మధ్యంతర బెయిల్ కోరుతూ ఆయన పిటిషన్లు వేశారు. ఆ పిటిషన్లపై హోరాహోరీగా వాదనలు జరగ్గా.. తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. మరోవైపు.. రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై జులై 29న విచారణ చేపడతామని కోర్టు వెల్లడించింది.
సీబీఐ కేసులో కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం(జులై 17) విచారించింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్ తరపున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు.
‘‘కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో ట్రయల్ కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాతే సీబీఐ ఆయనను అరెస్టు చేసింది. అప్పటిదాకా సీబీఐ కనీసం కేజ్రీవాల్‌ను లిక్కర్ కేసులో విచారించలేదు. 2022లో కేసు నమోదైతే 2024 జూన్‌లో విచారించడమేంటి. అదీ కోర్టులో జడ్జి ఎదుటే అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?. ఇది కచ్చితంగా బెయిల్ తర్వాత వచ్చిన ఆలోచనతో చేసిన ‘ఆఫ్టర్‌థాట్ ఇన్సూరెన్స్’ అరెస్ట్.
సీబీఐ కేజ్రీవాల్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించింది. అరెస్టు సీర్పీసీ సెక్షన్ 41 ప్రకారం చట్ట విరుద్ధం. ఆయన ఒక సీఎం. టెర్రరిస్టు కాదు’అని సింఘ్వీ వాదించారు.
కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ అఫిడవిట్
అంతకుముందు కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీబీఐ ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ వేసింది. ‘ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీఎం కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా మార్పులు చేశారు. లిక్కర్ పాలసీలో మార్పులు చేసినందుకుగాను సౌత్ గ్రూపు వద్ద నుంచి రూ.100 కోట్ల దాకా లంచం తీసుకున్నారు. ఈ డబ్బులను గోవా ఎన్నికల్లో ‘ఆప్’ పార్టీ తరపున ఖర్చు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ కుట్రలో ప్రధాన సూత్రధారి. పాలసీ రూపకల్పన మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది’అని సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొంది.
కాగా, కేజ్రీవాల్ లిక్కర్‌స్కామ్ సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయినా సీబీఐ కేసులో రిమాండ్‌లో ఉండటంతో ఆయన తీహార్ జైలులోనే ఉండిపోవాల్సి వచ్చింది.
ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చి నెలలో కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన తీహార్ జైలులోనే ఉన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల ప్రచారానికిగాను ఆయనకు సుప్రీంకోర్టు కొన్ని రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. బెయిల్ ముగిసిన తర్వాత కేజ్రీవాల్ తిరిగి జైలుకు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment