Satya Pal Malik News: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(76)కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) శుక్రవారం సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో సత్యపాల్ మాలిక్‌ను ప్రశ్నించాలని సీబీఐ భావించింది. ఈ మేరకు ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసులో సాక్షిగానే తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ సమన్లలో కోరింది.
2018లో కంపెనీ కాంట్రాక్ట్‌ను ఆ సమయంలో జమ్ము కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఆ ఫైల్స్‌ను స్వయంగా పర్యవేక్షించానని చెబుతూ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యుల మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు సంబంధించి స్కాం ఇది. దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగులు 2018 సెప్టెంబర్‌లో ఇందులో చేరారు. అయితే.. అవకతవకలు ఉన్నాయంటూ నెలకే ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ సంచలనానికి తెర తీశారు అప్పుడు గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్.
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్సూరెన్స్ బ్రోకర్స్‌ను నిందితులుగా చేర్చింది సీబీఐ. ఇందులో మోసం జరిగిందని మాలిక్ ఆరోపించడంతో.. ఆయన నుంచి అదనపు సమాచారం సేకరించేందుకే సీబీఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.
CBI has asked me to come to their Delhi office to give clarification regarding the alleged insurance scam in J&K on 27th or 28th April: Former J&K Governor Satyapal Malik on alleged insurance scam involving Reliance General Insurance
— ANI (@ANI) April 21, 2023
(file photo) pic.twitter.com/t9kLr3Dvrp
ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో మాలిక్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది సీబీఐ. అందులో ఒకటి పైన చెప్పుకున్న ఇన్సూరెన్స్ స్కీమ్‌ది కాగా, రెండోది జమ్ము కశ్మీర్ దాదాపు రూ.2,200 కోట్ల వ్యయంతో చేపట్టిన కిరూ హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలు.
రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్‌ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని సత్యపాల్ మాలిక్ ఏప్రిల్ 14న కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనికి ముందు, డీబీ లైవ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మాలిక్ ఈ ప్రస్తావన చేశారు. ఈ లైవ్ ప్రసారం కాగానే సత్యపాల్ మాలిక్‌కు రామ్ మాధవ్ పరువునష్టం నోటీసు పంపారు కూడా.
సంచలనంగా సత్యపాల్ మాలిక్
చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సత్యపాల్ మాలిక్. ఆ తర్వాత భారతీయ లోక్‌దల్ పార్టీలో చేరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మాలిక్.. 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు కూడా. ఆపై బీహార్, జమ్ము కశ్మీర్, గోవా, మేఘాలయాకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను కేంద్రం వెనక్కి తీసుకున్న సమయంలో ఈయనే గవర్నర్‌గా ఉన్నారు. రైతుల ఉద్యమ సమయంలో ఈయన రైతులకు మద్దతు ప్రకటించడం, కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
తాజాగా.. పుల్వామా దాడి, నరేంద్ర మోదీ మీద తాజాగా (ఏప్రిల్ 14వ తేదీన) కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనానికి తెర తీసింది. అవినీతిపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే అందులో ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు ఆయనకు సన్నిహితులేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు పుల్వామా దాడి సమయంలో మోదీ, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవల్ గవర్నర్‌గా ఉన్న తనకు చేసిన సూచనలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 300 కేజీల ఆర్డీఎక్స్ పాక్ నుంచి రావడం, జమ్ము కశ్మీర్‌లో పది నుంచి పదిహేను రోజులపాటు చక్కర్లు కొట్టడం, దానిని అధికారులు గుర్తించలేకపోవడం పైనా మాలిక్ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment