మోర్తాడ్ (బాల్కొండ) : అవ్వ పెట్టదు అడుక్కు తిననివ్వదు.. అన్నట్లుగా ఉంది వలస కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు. ఉన్న ఊరిలో ఉపాధి అవకాశాలు లేక దేశం విడిచి గల్ఫ్‌కు వలస వెళుతున్న మన కార్మికుల పట్ల సానుకూలంగా వ్యవహరించాల్సిన విదేశాంగ శాఖ అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని ఆరోపణలు వస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారత కార్మికుల శ్రమను గుర్తించి వారికి తగిన వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వాలకు సూచించాల్సిన మన విదేశాంగ శాఖ, కార్మికులకు నష్టం కలిగించేలా ఉత్తర్వులను జారీ చేసిందని చెబుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గల్ఫ్ దేశాలకు సంబంధించి కార్మికుల ఇమ్మిగ్రేషన్ విధానంలో కనీస వేతనాల కుదింపుపై అక్కడి ప్రభుత్వాలకు భారత్ సమ్మతి తెలిపిందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. కార్మికుల వేతనాల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించడానికి ఆమోదం తెలుపుతూ విదేశాంగ శాఖ రహస్యంగా ఉత్తర్వులు జారీ చేసిందని ఆ సంఘాలు వెల్లడించాయి.
ఈ మేరకు గత సెపె్టంబర్ 8న ఒక ఉత్తర్వును, అదే నెలలో 21వ తేదీన మరో ఉత్తర్వును విదేశాంగ శాఖ జారీ చేసిందని చెబుతున్నారు. గత సెప్టెంబర్‌లోనే ఈ ఉత్తర్వులు వెలువడినా గల్ఫ్ దేశాలకు ఇటీవలే మళ్లీ కార్మికుల వలసలు ప్రారంభం కావడంతో ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో విదేశాంగ శాఖ ఉత్తర్వుల విషయం తెలిసిందని కార్మికులు చెబుతున్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారత కార్మికులకు కనీస వేతనాన్ని కుదించవచ్చని విదేశాంగ శాఖ ఆయా ప్రభుత్వాలకు ఇచ్చిన సమ్మతి ఉత్తర్వులపై పునరాలోచన చేయాలని ఇమ్మిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో చొరవ తీసుకోవాలని ఆయన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, ఎంపీ కె.ఆర్. సురేశ్‌రెడ్డిలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్తర్వుల వల్ల కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన మిగతా ఎంపీలు కూడా దీనిపై దృష్టిసారించాలని ఆయన కోరారు.
ఖతర్, బహ్రెయిన్, ఒమన్, యునైటెడ్ అర బ్ ఎమిరేట్స్ (యూఏఈ)లు నెలకు 200 అమెరికన్ డాలర్ల వేతనం.. అంటే మన కరెన్సీలో దాదా పు రూ.15 వేలు కార్మికులకు చెల్లించవచ్చని విదేశాంగ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొందని చెబుతున్నారు. అలాగే కువైట్‌లో పనిచేసే కార్మికులకు 245 డాలర్లు, సౌదీ అరేబియాలో పని చేసేవారికి 324 డాలర్ల వేతనం చెల్లించవచ్చ ని మన విదేశాంగ శాఖ అమోదం తెలిపిందని అంటున్నారు. అయితే ఇదింకా ఎక్కువ ఉండాలని కార్మికులు చెబుతున్నారు. ఖతర్‌లో పనిచేసే వలస కార్మికులకు కనీసంగా 1,300 రియాళ్ల వేతనం చెల్లించాలని అక్కడి ప్రభుత్వం ఆయా కంపెనీలకు నిర్దేశించగా మన విదేశాంగ శాఖ దానిని దృష్టిలో ఉంచుకోకుండా తక్కువ వేతనానికే భారతీయ కార్మికులు పనిచేస్తారని హామీ ఇచ్చిందని తెలుస్తోంది. యూఏఈలో కార్మికులకు నెలకు రూ.16వేల నుంచి రూ.30 వేల వరకు వేతనం లభిస్తుంది. విదేశాంగ శాఖ ఉత్తర్వులతో ఆ వేతనం తగ్గుతుందని అంటున్నారు.
కార్మిక, కర్షకుల కష్టంతోనే దేశపురోగతి
క్యాపిటలిస్టులతో దేశాభివృద్ధి జరగడం లేదని, కార్మికుల, కర్షకుల కష్టంతోనే పురోగతి సాధిస్తోందని రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, సఫాయి కర్మచారి ఉద్యమకారుడు బెజవాడ విల్సన్ అన్నారు. సోమవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ‘ఆలిండియా కన్వెన్షన్ ఫర్ దళిత్ రైట్స్ అండ్ ఎగైనెస్ట్ అట్రాసిటీస్ ఆన్ దళిత్స్’ కార్యక్రమం జరిగింది. సదస్సుని బెజవాడ విల్సన్ ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. దేశంలో రైతులను, శ్రామికులను చిన్నచూపుతో చూస్తే సహించేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 58.9 శాతం దళితులు ఇప్పటికీ భూమి లేకుండా రైతు కూలీలుగా జీవనాన్ని వెళ్లదీస్తున్నారన్నారు. దేశం లో సామాజిక, కుల వివక్షకు బీజేపీ వంటి హిందూత్వ పార్టీలే ప్రధాన కారణమని విమర్శించారు. పేదరికం కారణంగా దళితుల జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటుచేసుకోలేదని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంక ట్ వాపోయారు. కార్యక్రమంలో హన్నన్ మొల్ల (ఏఐకేఎస్), ఏఐఏడబ్ల్యూయూ నేత విక్రమ్ సింగ్, తెలంగాణ కార్మిక సంఘం నేత ఐలయ్య, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం నేత వెంకటేశ్వర్లు, గుల్జార్‌సింగ్ గోరియా (బీకేఎంయూ), అసిత్ గంగూలీ (ఎస్కేఎస్), సంజయ్ శర్మ (ఏఐఏఆర్‌ఎల్‌ఏ), సాయి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment