ఆ జర్నలిస్ట్‌‌లకు శిక్ష తప్పదు: మావోయిస్టులు | Chattisgarh Cold War Between Maoists And Journalists | Sakshi
Sakshi News home page

ఆ జర్నలిస్ట్‌‌లకు శిక్ష తప్పదు: మావోయిస్టులు

Published Fri, Feb 19 2021 2:43 PM | Last Updated on Fri, Feb 19 2021 2:55 PM

Chattisgarh Cold War Between Maoists And Journalists - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చర్ల: రాష్ట్ర సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి, మీడియాకు ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. బస్తర్‌ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధులు మీడియా ముసుగులో దళారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 9వ తేదీన మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్‌ జోనల్‌ కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. బస్తర్‌ ప్రాంతంలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలను వెళ్లగొట్టి.. ఆ ప్రాంతంలో ఉన్న విలువైన గనులను దోచుకోవడానికి ప్రభుత్వాలు కుట్ర పన్నాయని ఆరోపించింది.

అందులో భాగంగానే అటవీ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను తరలిస్తూ.. ఆదివాసీలపై దాడులు చేస్తూ.. వారిని వెళ్లగొట్టేందుకు యత్నిస్తున్నాయని పేర్కొంది. ఈ వ్యవహారంలో కొందరు సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధుల పాత్ర కూడా ఉందని.. బీజాపూర్‌ జిల్లాకు చెందిన గణేశ్‌ మిశ్రా, లీలాధర్‌రథి, విజయ్, ఫారూఖ్‌ అలీ, సుబ్రాస్తు చౌదరి పేర్లను ప్రస్తావించింది. ఆ అవినీతిపరులను, కార్పొరేట్‌ శక్తుల బ్రోకర్లను ప్రజాకోర్టులో ప్రజలు తప్పకుండా శిక్షిస్తారంటూ పార్టీ తన లేఖలో పేర్కొంది.  

మీడియా ప్రతినిధుల్లో కలవరం.. 
మావోల హెచ్చరికలతో బస్తర్‌ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇదేమి కొత్త కాదు.. ప్రాణాలకు తెగించి ఈ ప్రాంతాల్లో జర్నలిస్టులు పని చేస్తుంటారన్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల క్రితం బీజాపూర్‌ జిల్లాలో పనిచేసిన సీనియర్‌ జర్నలిస్ట్‌ సాయిరెడ్డితోపాటు అదే జిల్లాకు చెందిన మరొక జర్నలిస్టుపై అనుమానం పెంచుకున్న మావోలు హతమార్చారు. మావోయిస్టులకు కొన్నిసార్లు అందే తప్పుడు సమాచారంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వెనక్కి తగ్గిన మావోలు.. 
ఇక ఛత్తీస్‌గఢ్‌ జర్నలిస్టులపై మావోలు చేసిన ఆరోపణలను జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. మావోలకు అందే తప్పుడు సమాచారం వల్ల కిడ్నాప్‌లకు గురైన పలువురు అమాయక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల పక్షాన నిలిచి జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి దండకారణ్యానికి వెళ్లి చర్చలు జరిపి సరైన సమాచారమిచ్చి బందీలుగా ఉన్న వారిని విడిపించడం జరిగింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న జర్నలిస్టులు ఇప్పటికీ సరైన ఇళ్లు లేక అద్దె ఇళ్లల్లోనే ఉంటున్నారని, అయితే మావోయిస్టుల ఆరోపణలను ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

మావోయిస్టుల హెచ్చరికలను వెనక్కి తీసుకోవాలంటూ జర్నలిస్టులు డిమాండ్‌ చేస్తున్నారు. స్థానిక జర్నలిస్టులకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన జర్నలిస్టు సంఘాలు మద్దతునిచ్చి ఆందోళనల్లో పాల్గొనడంతో మావోయిస్టులు అంతర్మథనంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న మావోయిస్టు పార్టీ సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరో ఆఫ్‌ మావోయిస్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు వద్దని, పరిస్థితిపై సామరస్యంగా చర్చించుకుందామని కోరింది. 

చదవండి: దూకుడే మంత్రం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement