CG Case: కేంద్రానికి సుప్రీం కోర్టు అల్టిమేటం! | Coast Guard Case: SC Warns Centre On Woman Officer Plea | Sakshi
Sakshi News home page

‘చేతకాకపోతే చెప్పండి..’ కేంద్రానికి సుప్రీం కోర్టు అల్టిమేటం

Published Mon, Feb 26 2024 6:42 PM | Last Updated on Mon, Feb 26 2024 7:36 PM

Coast Guard Case: SC Warns Centre On Woman Officer Plea - Sakshi

న్యూఢిల్లీ: కోస్ట్‌గార్డుకు చెందిన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలనే విషయంలో మహిళా అధికారుల అభ్యర్థనను వదిలిపెట్టలేమని మంగళవారం సుప్రీంకోర్టు పేర్కొంది. కోస్ట్‌గార్డుకు చెందిన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు.

కోస్ట్‌ గార్డుకు చెందిన మహిళా అధికారులకు సంబంధించిన శాశ్వత కమిషన్‌ను ఇప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. మీకు(కేంద్ర ప్రభుత్వం) ఏర్పాటు చేయటం చేతకాకపోతే చెప్పండి.. మేం ఏర్పాటు చేస్తాం అని పేర్కొన్నారు. కావున త్వరగా శాశ్వత కమిషన్‌లో మహిళా కోస్ట్‌ గార్డు అధికారులకు చోటు కల్పించాలని చీఫ్‌ జస్టిస్‌.. అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణీని ఆదేశించారు. ఈ విషయంలో అఫిడవిట్‌ దాఖలు చేయవల్సిందిగా  కోస్ట్‌గార్డును కోరుతామని అటార్నీ జనరల్‌.. సుప్రీం కోర్టుకు తెలియజేశారు. అదేవిధంగా నేవి, ఆర్మీతో పోల్చితే కోస్ట్‌గార్డు భిన్నమైనదని అటర్నీ జనరల్‌ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌ తదుపరి విచారణను సుప్రీం కోర్టు మార్చి 1కి వాయిదా వేసింది.    

ఇక.. ఇండియన్ కోస్ట్‌గార్డు అధికారి ప్రియాంక త్యాగి దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 19 విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కోస్ట్‌ గార్డు విషయంలో​ మహిళా అధికారుల పట్ల ఎందుకు తేడాలు చూపుతున్నారు. మహిళా అధికారులు కోస్ట్‌ గార్డులో ఎందుకు ఉండకూడదు?. దేశ సరిహద్దుల్లో మహిళలు ప్రహారా కాస్తున్నప్పుడు.. సముద్ర తీరం గస్తీ కాయటంలో తప్పేంటీ?. మీరే(కేంద్ర ప్రభుత్వం) నారీ శక్తి గురించి మాట్లాడుతున్నారు.. దాన్ని ఆచరణలో చూపించండి’ అని కేంద్రాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement