అక్కడ నియంతృత్వం ఉంది
విపక్ష నేతలను జైల్లో పడేశారు
మోదీ సర్కార్‌పై కేజ్రీవాల్ ఆరోపణ
అమృత్‌సర్: మోదీ సర్కార్ హయాంలో దేశపరిస్థితులు రష్యాను తలపిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శుక్రవారం అమృత్‌సర్‌లో ఆప్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలతో సమావేశం సందర్భంగా కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘‘ భారత్‌లో కొనసాగుతున్న ఈ నియంతృత్వ పాలనకు ఇంక ఎంతమాత్రం ఆమోదించేదిలేదు.
గత 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతావనిలో ఇలా పనిగట్టుకుని విపక్షనేతలను జైల్లో పడేయడం ఎన్నడూ చూడలేదు. రష్యాలో అయితే కీలక విపక్షనేతలందర్నీ జైలుకు పంపేసి, కొందర్ని చంపేసి పుతిన్ దేశాధ్యక్ష ఎన్నికలు జరిపి 87 శాతం ఓట్లు గుప్పిట బిగించారు. ఎన్నికల్లో విపక్షాలు లేకపోవడంతో ఓట్లు పొందడానికి నువ్వు ఒక్కడివే మిగులుతావు’’ అని మోదీనుద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
‘‘ వాళ్లు(బీజేపీ) నన్ను, ఢిల్లీ మాజీ డెప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జైల్లో పడేశారు. కాంగ్రెస్ ఖాతాలను స్తంభింపజేశారు. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే మంత్రులను జైలుకు పంపారు. విపక్ష నేతలను చెరసాలలో వేశాక ఒకే పార్టీ, ఒక్కడే అగ్రనేత సాధ్యం. అప్పుడు ప్రజాస్వామ్యం అసాధ్యం. ఇది జరక్కుండా మనం ఆపాలి’’ అని అన్నారు. ‘ నేను జైలు గదిలో ఉన్నపుడు గదిలో రెండు సీసీటీవీ కెమెరాలతో 13 మంది అధికారులు అనుక్షణం గమనించేవారు.
ఒక ఫుటేజీ నేరుగా ప్రధాని మోదీకి వెళ్లేది. అక్కడ రెండు టీవీల్లో గమనించేవారు. నన్ను ఎలాగైనా అణచేస్తామని విశ్వప్రయత్నం చేశారు. అరెస్ట్‌తో అంతా అయిపో తుందని, పార్టీ ముక్కలు చెక్కలై ప్రభుత్వం కూలు తుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఆప్ ఒక కుటుంబం. కుటుంబానికి ఏదైనా కష్టమొస్తే కుటుంబసభ్యులంతా ఏకమై పోరాడతారు. నా అరెస్ట్ తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త కేజ్రీవాల్‌గా మారి పోరాడారు’’ అని అన్నారు.
నన్ను నిరుత్సాహపరచకండి
‘‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి జైలులో ఎవరినైనా కలవడానికి వస్తే గదిలో మాట్లాడే ఏర్పాటుచేయాలని జైలు నియమావళిలో ఉంది. పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ వచ్చినపుడు ఒక గదిలో జైలు సూపరింటెండెంట్ భేటీ ఏర్పాట్లుచేయలేదు. పంజాబ్‌లో మొత్తం 13 లోక్‌సభ స్తానాలను గెల్చుకునేలా ఆప్ నేతలు కష్టపడాలి. జూన్ రెండో తేదీన జైలుకెళ్తా. జూన్ 4 నాటి ఫలితాలను అక్కడి టీవీలో చూస్తా. టీవీలో ‘పంజాబ్‌లో అన్ని సీట్లు ఆప్ గెలిచింది’ అనే వార్త కోసం ఎదురుచూస్తుంటా. నన్ను నిరుత్సాహ పరచకండి’’ అని ఓటర్లకు విజ్ఞప్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment