న్యూఢిల్లీ: కోవిడ్–19తో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ఆన్‌లైన్ పోర్టల్‌ను సీఎం కేజ్రీవాల్ మంగళవారం ప్రారంభించారు. ‘ముఖ్యమంత్రి కోవిడ్–19 పరివార్ ఆర్థిక్ సహాయతా యోజన’కింద అందే దరఖాస్తుల్లో తప్పులు వెదకరాదని ఈ సందర్భంగా ఆయన అధికారులను కోరారు. కోవిడ్‌తో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఈ పథకం కింద రూ.50వేలు పరిహారంగా అందించడంతోపాటు మరణించిన వ్యక్తి ఆ కుటుంబానికి జీవనాధారమైతే, మరో రూ.2,500 నెలవారీగా ప్రభుత్వం అందజేస్తుంది.
ఈ సందర్భంగా వర్చువల్‌గా జరిగిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కరోనా నాలుగో వేవ్ ఢిల్లీలోని ప్రతి కుటుంబంపైనా ప్రభావం చూపిందనీ, చాలా మంది చనిపోయారని చెప్పారు. చాలా మంది చిన్నారులు అనాథలుగా మారగా, కొందరు కుటుంబ పెద్దను కోల్పోయాయి. ఇలాంటి వారికి ఆసరాగా నిలిచేందుకు ఈ పథకాన్ని ప్రారంభించాం’అని ఆయన అన్నారు. ‘ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మా ప్రతినిధులు కూడా బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి, దరఖాస్తులు స్వీకరిస్తారు’అని ఆయన వెల్లడించారు. బాధిత కుటుంబాల వద్ద సంబంధిత పత్రాలు ఏవైనా లేకున్నా దరఖాస్తులను మాత్రం తిరస్కరించబోమన్నారు. బాధిత కుటుంబాలకు సాధ్యమైనంత త్వరగా సాయం అందించడమే తమ లక్ష్య మని పేర్కొన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందే కుటుంబాలకు ఆదాయ పరిమితి లేదని చెప్పారు.
ఢిల్లీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖ జూన్ 22వ తేదీన ‘ముఖ్యమంత్రి కోవిడ్–19 పరివార్ ఆర్థిక సహాయతా యోజన’ను నోటిఫై చేసింది. ‘మృతుడు, దరఖాస్తు దారు ఢిల్లీకి చెంది ఉండాలి. అది కోవిడ్ మరణమేనని ధ్రువీకరణ ఉండాలి. లేదా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయిన నెల రోజుల్లోనే మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ కోవిడ్ మరణంగా ధ్రువీకరించాలి’అని ఆ నోటిఫికేషన్‌లో తెలిపింది. కోవిడ్‌తో తల్లిదండ్రుల్లో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్యతోపాటు, 25 ఏళ్లు వచ్చే వరకు నెలకు రూ.2,500 చొప్పున సాయంగా అందించనున్నట్లు ఇప్పటికే కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment