న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 7,178 కరోనా కేసులు నమోద కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇంత వరకు ఢిల్లీలో 7000 కరోనా కేసుల సంఖ్యను ఎప్పుడూ దాటలేదు. గత మూడు రోజుల నుంచి రోజుకి 6000కి పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండో అత్యధిక కేసులు నవంబర్ 4న 6842 కేసులు నమోదయ్యాయి. నగరంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,23,831కి చేరింది. గత 24 గంటల్లో 64 మరణాలు సంభవించాయని, మరణాల రేటు 1.6 శాతంగా ఉందని, రికవరీ రేటు 89 శాతంగా ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. సీతాకాలం సమీపించడంతో నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో వాయు కాలుష్యం పెరగడం మూలంగానూ ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.
శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం
శీతాకాలంలో వాయు కాలుష్యం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావితం చేస్తుందని, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. ఢిల్లీలో రోజువారీగా కరోనా సోకే సగటు రేటు 12.2 శాతంగా ఉంటే జాతీయ సగటు రేటు 3.9 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా నమోదు కావడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రం ప్రభుత్వం రాష్ట్రాలకు విజ‍్క్షప్తి చేస్తుంది.
నగరంలో కోవిడ్ నియంత్రణకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ గురువారం ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ఢిల్లీ ప్రభుత్వ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. నగరంలో కోవిడ్ ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్యను పెంచాలని, కొవిడ్ సోకిన వారికి మెరగైన వైద్యం అందించాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. యాంటిజెన్ పరీక్షలలో కరోనా నెగటివ్ వచ్చినప్పటికీ కరోనా లక్షణాలు ఉన్నట్లనిపిస్తే తప్పనిసరిగా పీసీఆర్ పరీక్ష చేయాలన్నారు. ఢిల్లీలోని ఉత్తర, మధ్య, ఈశాన్య, తూర్పు, వాయువ్య ఆగ్నేయ ఆరు జిల్లాల్లో కరోనా పెరుగుదల రేటు గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
దేశ కరోనా రాజధాని
నగరంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసులపై ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు గురువారం విమర్శించడమే గాక నగరం త్వరలోనే "దేశ కరోనా రాజధాని"గా మారనుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. గత వారం హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ప్రభుత్వ అధికారుల సమావేశంలో కరోనా కేసులు పెరగడానికి పండుగలు, ప్రజలు గుంపులు గుంపులుగా తిరగడం, కోవిడ్ నిబంధనలు పాటించకపోవడమే ప్రధాన కారణాలుగా పేర్కొంది. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 84.11 లక్షలు కాగా, 1,24,985 మంది మరణించారు.
దేశ వ్యాప్తంగా ప్రస్తుత కరోనా కేసుల సంఖ్య 5.2 లక్షలు. రికవరీ అయిన వారి సంఖ్య 77.66 లక్షలకు చేరింది. శుక్రవారం ఒక రోజే 54,157 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, బిహార్ పలు రాష్ట్రల్లో కేసుల విపరీతంగా పెరగడంతో మళ్లీ లాక్‌డౌన్ ప్రకటించాలనే చర్చకుడా సాగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా యూరోపియన్, ఇతర దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నాయి. ఇదే విధంగా దేశంలో కరోనా ప్రభావం ఎక్కువైతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించక తప్పదు. ఇక నుంచైనా ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జీవనం కొనసాగించకపోతే అంతే సంగతులని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment