దేశ రాజధాని నీట మునిగింది. మూడురోజుల ఎడతెరిపి ఇవ్వని వర్షంతో.. ఢిల్లీకి ఈ దుస్థితి ఏర్పడింది. 205 మీటర్ల డేంజర్ మార్క్‌ను ఇప్పటికే దాటేసి మరీ యమునా నది మహోగ్ర రూపంతో ఉప్పొంగుతోంది. నీటి స్థాయి ఇంకా పెరుగుతూ పోవడంతో ఎప్పుడు.. ఏం జరుగుతుందో ఆందోళన నెలకొంది. అందుకే యమునా నది తీరం వెంట 144 సెక్షన్ విధించారు!. అయితే వర్షాలే రాజధాని ప్రాంతం నీట మునగడానికి కారణం కాదా?
ఢిల్లీ.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షం, దీనికి తోడు హర్యానా హర్యానాలోని హథ్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్లే రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం వరద పరిస్థితి నెలకొంది. మోకాళ్ల లోతు నీటిపైనే నీరు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. అయితే.. నిపుణులు మాత్రమే ఇవి మాత్రమే కారణాలు కాదని చెబుతున్నారు.
ఢిల్లీ వరద పరిస్థితులపై సెంట్రల్ వాటర్ కమిషన్(CWC)కి చెందిన ఓ సీనియర్ అధికారి స్పందించారు. హర్యానా యమునానగర్‌లోని హథ్నీకుండ్ బ్యారేజ్ నుంచి ఎన్నో ఏళ్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుంటారు. 180 కిలోమీటర్ల ప్రయాణం.. అదీ రెండు, మూడు రోజుల తర్వాత అది ఢిల్లీకి చేరుకునేది. అయితే..
ఈసారి తక్కువ టైంలో వరద నీరు ఢిల్లీ వైపునకు చేరింది. అదే సమయంలో భారీ వర్షాలు కురవడంతో.. ఆ నీరు ఈ నీరు కలిసి ఢిల్లీని వరదలా ముంచెత్తాయి. అయితే.. దీనికి ప్రధాన కారణం ఆక్రమణలు, నేల కోత(కట్టడాలతో పాటు కాలుష్యమూ దీనికి కారణంగా చెబుతున్నారు). ఇంతకుముందు, నీరు ప్రవహించడానికి ఎక్కువ స్థలం ఉండేది. ఇప్పుడు నేల కోత, అక్రమ కట్టడాల కారణంగా అది కుంచించుకుపోయిందని చెబుతున్నారాయన.
ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (INTACH)లోని నేచురల్ హెరిటేజ్ డివిజన్ ప్రిన్సిపల్ డైరెక్టర్ మను భట్నాగర్.. యమునా నది ఇంతలా ఉప్పొంగడానికి విపరీతమైన వర్షపాతం కారణమని అభిప్రాయపడ్డారు. యమునా నదికి ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఎక్కువ కాలం పడే వర్షాల వల్ల వరద ప్రభావం కనిపించేది కాదు. కానీ, ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదు అయ్యింది. అందువల్లే దిగువన ఈ పరిస్థితి నెలకొందని మను భట్నాగర్ అంటున్నారు.
నదీ డ్యామ్‌లపై అధ్యయనం చేసిన అనుభవం ఉన్న నిపుణుడు భీమ్ సింగ్ రావత్ యమునా నది నదీ కోత వల్ల.. నదీగర్భం ఎత్తు పెరిగిపోవడమేనని అభిప్రాయపడ్డారు. ‘‘వజీరాబాద్ నుంచి ఓక్లా వరకు 22 కిలోమీటర్ల నది విస్తీర్ణంలో.. 20 కంటే ఎక్కువ వంతెనలు ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. తద్వారా నదీ కోతకు గురై.. ఇసుక మేటలు ఏర్పడ్డాయి. అదే సమయంలో కాలుష్య కారకాలూ కూడా నీటి ప్రవాహానికి అడ్డుతగులుతున్నాయి’’ అని ఆయన చెప్పారు.
ఢిల్లీలో యమునా నదీ చుట్టుపక్కల ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. పరిస్థితి ఇవాళ్టికి మరింత దిగజారే అవకాశం ఉండడంతో.. నదీ చుట్టుపక్కలకు వెళ్లకూడదని నిషేధాజ్ఞాలు జారీ అయ్యాయి. ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతంలో.. 208.46 మీటర్ల లెవల్‌కు నీటి స్థాయి చేరుకుంది. 1978లో ఇది 207.49 మీటర్లు దాటింది. జాతీయ విపత్తు స్పందన బలగాల(NDRF) నుంచి 12 బృందాలు ఇప్పటికే మోహరించాయి.
Comments
Please login to add a commentAdd a comment