ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు: ఈసీ | EC Announced Lok Sabha And Few States Elections 2024 Dates | Sakshi
Sakshi News home page

ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు: ఈసీ

Published Sat, Mar 16 2024 3:48 PM | Last Updated on Sat, Mar 16 2024 4:48 PM

EC Announced Lok Sabha And Few States Elections 2024 Date - Sakshi

ఢిల్లీ, సాక్షి: దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. ఢిల్లీలో విజ్ఞాన్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించారు. జూన్‌ 16తో ప్రస్తుత లోక్‌సభ కాలపరిమితి ముగుస్తుందని, ఆలోపు సార్వత్రిక ఎన్నికలకు ఈసీ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందన్నారాయన.

దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుందని సీఈసీ ప్రకటించారు. ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌ ఉంటుందని తెలిపారు. ఏప్రిల్‌ 26న రెండో దశ, మూడో దశలో మే7వ తేదీన, మే 13న నాలుగో దశలో, మే 20వ తేదీన ఐదో దశ పోలింగ్‌, మే 25న ఆరో దశ, జూన్‌1న ఏడో దశ పోలింగ్‌ ఉంటుందని సీఈసీ తెలిపారు. నేటి నుంచి జూన్‌ 6వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమలులో ఉండనుందని తెలిపారు.
   

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం ఎన్నికల తేదీలను రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన నేపథ్యంలో.. తక్షణమే ఎన్నికల కోడ్‌ దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈసీ షెడ్యూల్‌ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో లోక్‌సభకు నాలుగో దశలో .. మే 13 వ తేదీనే ఏపీ(అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌తో పాటు), తెలంగాణలో పోలింగ్‌ జరగనుంది. అలాగే.. కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా ఇదే తేదీన జరగనుంది. జూన్‌ 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి.

పలుదఫాల సమీక్షల తర్వాతే..
ఏడాదిన్నర కాలంగా ఎన్నికల కమిషన్‌ పలు అసెంబ్లీ ఎన్నికలను సమర్థంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా నిర్వహించగలిగింది. కోర్టు కేసుల సంఖ్య కూడా తగ్గింది. జప్తులు పెరిగాయి. నకిలీ వార్తలపై చర్యలు తీసుకోవడం ఎక్కువైంది. గతంలో కంటే ఎన్నికల వ్యవస్థలు మరింత మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకున్నాం. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాం.  దేశవ్యాప్తంగా పర్యటించి ఎస్పీలు, కలెక్టర్లతో చర్చించాం. శాంతి భద్రతలు, బలగాల మోహరింపుపై సమగ్రమైన చర్చలు జరిపాం. కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుని ఎన్నికల తేదీలు నిర్ణయించాం అని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు.

ఏ ఓటర్లు ఎంతమందంటే..
2024ను ప్రపంచ ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చు. స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం నెలకొన్న భారతదేశం ఎలా ఓటు చేస్తుందన్నది ప్రపంచం గమనిస్తోంది. ఈ సార్వత్రిక ఎన్నికల కోసం.. దేశవ్యాప్తంగా మొత్తం 97 కోట్ల మంది రిజిస్టర్డ్‌ ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోబోతున్నారు. 49.7 పురుష ఓటర్లు.. 47. 1 కోట్లు మహిళా ఓటర్లు ఉన్నారు. కోటి మంది 82 లక్షల కొత్త ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది(1.89 శాతం పెరిగింది). 12 రాష్ట్రాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లు 85 లక్షల మంది ఉన్నారు. 88 లక్షల 40 వేల మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. యువ ఓటర్లలో మహిళా ఓటర్లే ఎక్కువ. 48 వేల మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. వందేళ్లు దాటిన ఓటర్లు 2 లక్షల 18 వేల మంది ఉన్నారు. 18-19 మధ్య ఓటర్లు 21 లక్షల మంది ఉన్నారు. 85 ఏళ్లు దాటిన వాళ్లకు, దివ్యాంగులకు  ఓట్‌ ఫ్రమ్‌ హోం సౌకర్యం కల్పిస్తున్నాం. ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తున్నాం. 

యువ ఓటర్లే ఈసీకి అంబాసిడర్లు
ఎన్నికల నిర్వహణ కోసం.. దేశవ్యాప్తంగా 10 లక్షల 50 వేల పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్‌ కేంద్రాల పర్యవేక్షణకు డ్రోన్‌లకు వినియోగిస్తున్నాం. 55 లక్షల ఈవీఎంలను సిద్ధం చేశాం. విధుల్లో 1.25 కోట్ల మంది సిబ్బంది పాల్గొనబోతున్నారు. వలంటీర్లు, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉండకూడదు.  ఈసారి ఎన్నికల్లో యువ ఓటర్లే(యువ ఓటర్లు 1.8 కోట్లు) తమకు బ్రాండ్‌ అంబాసిడర్లని సీఈసీ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ అనేది ప్రతిసారీ మాకు పరీక్షే ఎన్నికల నిర్వహణ అనే పరీక్షలో విజయం సాధించాలనేదే లక్ష్యం. ప్రతి అంచెలోనూ మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎలాంటి లోపం లేకుండా ఎన్నికలు జరపాలనేదే ఈసీ ప్రయత్నమని.. దేశ పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారాయన.

సోషల్‌ మీడియా పోస్టులు.. ప్రత్యేక అధికారుల నియామకం
ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో రూ. 3,400 కోట్లు సీజ్‌ చేశాం. ఎన్నికల సందర్భగా కానుకలివ్వడం.. ప్రలోభాలకు గురి చేసేవారిపై ప్రత్యేక నిఘా ఉంటుంది. ఈడీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచుతాం. బ్యాంక్‌ ఖాతాలు, లావాదేవీలపై ప్రత్యేక మానిటరింగ్‌ ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత బ్యాంక్‌ క్యాష్‌ వాహనాలకు సైతం అనుమతి ఉండదు. సోషల్‌ మీడియాలో పోస్టుల నియంత్రణకు ప్రత్యేక అధికారుల్ని నియమిస్తున్నాం. ప్రచారాల్లో ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలు ఉండకూడదు. ఫేక్‌న్యూస్‌ కోసం ఫ్యాక్ట్‌ చెక్‌ సౌకర్యం కల్పిస్తాం.  కులం, మతం పేరుతో ఓట్లు అడగొద్దు.  కులాన్ని, మతాన్ని రెచ్చగొట్టేలా స్పీచ్‌లు ఇవ్వొద్దు. హింసకు పాల్పడితే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అవుతుంది. స్టార్‌ క్యాంపెయినర్లకు గైడ్‌లైన్స్‌ ఇస్తాం. పార్టీల మిస్‌లీడ్‌ ప్రచారాలను ఒప్పుకోం. రెండోసారి ఓటేయడానికి వస్తే కేసు నమోదు చేస్తాం.  ప్రతి జిల్లాలో కంట్రోల్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తాం. ఈసీకి వచ్చే ఫిర్యాదులపై వేగంగా విచారణ చేస్తాం. దర్యాప్తు స్వచ్ఛందంగా చేస్తాం అని సీఈసీ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement