సాక్షి, న్యూఢిల్లీ: సుమారు గత ఏడాది కాలంగా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి అంతానికి మార్గం సుగమవుతోంది. కరోనా వాక్సిన్లు త్వరలోనే దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సీరం ఉత్పత్తి చేస్తున్న ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ వాక్సిన్‌కు నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదం కోసం వేచి చూస్తోంది. తాజాగా తుది ఆమోదానికి ఒక అడుగు దూరంలో భారతదేశంలో రెండవ టీకాగా భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాక్సిన్ అవతరించింది. (వ్యాక్సిన్: సుబ్రమణియన్ స్వామి కీలక వ్యాఖ్యలు)
స్వదేశీ తొలి వ్యాక్సిన్‌గా భావిస్తున్న కోవాక్సిన్ ఆమోదానికి సంబంధించి శనివారం కీలక అడుగు పడింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన స్వదేశీ కోవిడ్-19 టీకా అత్యవసర ఉపయోగం కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సబ్జెక్ట్ నిపుణుల ఆమోదం తెలిపింది. ఈ మేరకు కమిటీ డీసీజీఐకి కూడా సిఫారసు చేసింది. కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి కూడా నిపుణుల కమిటీ శుక్రవారం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో భారత్లో అత్యవసర వినియోగానికి రెండు వ్యాక్సిన్లకు అనుమతి కమిటీ లభించినట్టయింది. భారత్ బయోటెక్ గత నెల(డిసెంబర్) 7న మొదట అత్యవసర వినియోగ అధికారం కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే మూడవ దశ క్లినికల్ ట్రయల్స్‌కు సంబంధించి మరింత డేటా సమర్పించాలని నిపుణుల కమిటీ కోరింది. (కరోనా వ్యాక్సిన్ : కోవిషీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్)
కాగా దేశవ్యాప్తంగా కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ పర్యవేక్షణలో డ్రైరన్ చేపట్టిన రోజే ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు కోవిడ్-19కు నాలుగు టీకాలు దాదాపు సిద్ధంగా ఉన్నది భారతదేశం మాత్రమేనని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ఫైజర్, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు యూకే అనుమతి ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. త్వరలోనే దేశంలో అత్యవసర ఉపయోగం కోసం ఒకటి కంటే ఎక్కువ వ్యాక్సిన్లు వచ్చే అవకాశం ఉందని మంత్రి సూచించారు.(తొలి విడతలో 3 కోట్ల మందికి టీకా ఉచితం : కేంద్ర మంత్రి)
Comments
Please login to add a commentAdd a comment