
నైనిటాల్ : అటవీ ప్రాంతాల్లో ఉండే రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాల వల్ల అక్కడ ఉండే చిన్ని ప్రాణులు మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపై అలా జరగకుండా వాటిని కాపాడేందుకు ఉత్తరాఖండ్‌లోని రామ్‌నగర్ అటవీశాఖ వినూత్నమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే స్థానిక అటవీశాఖ అధికారులు కలాదుంగి- నైనిటాల్ జాతీయ రహదారిలో మొట్టమొదటి ఎకో బ్రిడ్జిని రూపొందించారు. ఈ ఎకో బ్రిడ్జిని రోడ్డు నుంచి 90 మీటర్ల ఎత్తు, 5 ఫీట్ల వెడల్పుతో నిర్మించారు.(చదవండి : వైస్ ప్రిన్సిపల్‌కే షాకిచ్చిన స్టూడెంట్స్)
దీనిపై కలాదుంగి ఫారెస్ట్ రేంజ ఆఫీసర్ అమిత్ కుమార్ గ్వాస్కోటి స్పందిస్తూ.. 'తరచుగా అటవీ ప్రాంతాల్లో ఉండే రోడ్లపై వేగంగా వెళ్లే వాహనాల ద్వారా చిన్న ప్రాణులు అనేకం బలవుతున్నాయి. ఇలాంటివి జరగకూడదనే ఎకో బ్రిడ్జిని రూపొందించాం. సిమెంట్, ఐరన్ లాంటి వస్తువులను వాడకుండా కేవలం వెదురు, గడ్డి ఉపయోగించి ఈ ఎకో బ్రిడ్జిని తయారు చేశాం . అటవీ ప్రాంతాల్లో ఉండే చిన్న జాతి జంతువులైన ఉడుత, పాములు లాంటవి వీటిపై నుంచి వెళితే ప్రమాదాల బారి నుంచి తప్పించే అవకాశం ఉంది.'అని ఆయన పేర్కొన్నారు.