2024 లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ నుంచి బరిలోకి దిగే తమ 42 మంది అభ్యర్థుల పేర్లను తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఇక్కడి బిష్ణుపూర్ స్థానం చర్చనీయాంశంగా మారింది. విడాకులు తీసుకున్న ఒక జంట ఈ సీటు నుంచి పరస్పరం పోటీకి దిగడం ఆసక్తికరంగా మారింది.
బంకురా జిల్లాలోని బిష్ణుపూర్ లోక్‌సభ స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ సౌమిత్రా ఖాన్‌కు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. అదే స్థానం నుండి అతని మాజీ భార్య సుజాత మండల్‌కు టీఎంసీ టికెట్ ఇచ్చింది. రాష్ట్రంలో 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సౌమిత్రా ఖాన్, సుజాత మండల్ విడిపోయారు. ఆ సమయంలో సుజాత మండల్ తృణమూల్ కాంగ్రెస్‌లో ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు సౌమిత్ర ఖాన్ టీఎంసీ నుండి బీజెపీలో చేరారు.
టీఎంసీ లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో కాంగ్రెస్‌తో పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. అయితే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియకు ముందు ఏ సమయంలోనైనా కూటమి ఏర్పడవచ్చని అన్నారు. కాగా పశ్చిమ బెంగాల్‌లోని 42 లోక్‌సభ స్థానాల్లో ఆరుగురు ముస్లిం అభ్యర్థులకు టీఎంసీ టిక్కెట్లు ఇచ్చింది. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మెగా ర్యాలీలో టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, మోదీ హామీకి ఎలాంటి వారెంటీ లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment