సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది జూన్ జీఎస్టీ వసూళ్లతో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఈ ఏడాది జూన్‌లో జీఎస్టీ కింద రూ.1,61,497 కోట్లు వసూలైనట్లు చెప్పారు. రాజ్య సభలో మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవా బిచ్చారు. ఒక్క నెలలో జీఎస్టీ మొత్తం వసూళ్లు రూ.1.6 లక్షల కోట్లు అధిగమించడం జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇది నాలుగోసారని చెప్పారు. జీఎస్టీ వసూళ్లలో ప్రతి సంవత్సరం సాధిస్తున్న వృద్ధితో అనుకూల ధోరణి కనిపిస్తోందన్నారు.
తాత్కాలికంగా అనుమతించిన జీఎస్టీ నష్టపరిహారం కింద మొత్తం సొమ్మును కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు విడుదల చేసిందని, బకాయిలేమీ లేవని చెప్పారు. పార్లమెంటులో చేసిన చట్టానికి లోబడి జీఎస్టీ యాక్ట్ ప్రకారం జీఎస్టీ అమలు చేయడం ద్వారా మొదటి 5 సంవత్సరాలు 2017 జూన్ 1 నుంచి 2022 జూన్ 30 వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఏర్పడిన రెవెన్యూ నష్టాలను పూడ్చేందుకు కేంద్రం నష్టపరి హారం చెల్లించిందని తెలిపారు. ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ప్రతి రెండు నెలల కోసారి లెక్కించి విడుదల చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
వ్యవస్థను బలోపేతం చేస్తేనే మీడియేషన్ ద్వారా కేసుల పరిష్కారం: విజయసాయిరెడ్డి
మధ్యవర్తిత్వం (మీడియేషన్)తో కేసులు పరిష్కరించాలంటే వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కేంద్రానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సూచించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కోటికి పైగా కేసులు పరిష్కరించాలంటే ఈ వ్యవస్థను వందరెట్లు బలోపేతం చేయాల్సి ఉంటుందన్నారు. మధ్యవర్తిత్వం బిల్లు–2021పై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. దేశంలోని వివిధ కోర్టుల్లో నాలుగున్నర కోట్లకుపైగా కేసులు పెండింగ్‌లో ఉంటే.. అందులో కోటికిపైగా సివిల్ కేసులేనని తెలిపారు. దేశంలో 2022 నాటికి 570 మీడియేషన్ కేంద్రాలు, 16 వేలమంది మీడియేటర్లు ఉన్నారని చెప్పారు.
ఈ సివిల్ కేసుల్లో 90 వేల కేసులను మాత్రమే పరిష్కరించగల సామర్థ్యం ప్రస్తుత మీడియేషన్ వ్యవస్థకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో బిల్లు చట్టరూపం దాలిస్తే తగినన్ని మీడియేషన్ సెంటర్లు, మీడియేటర్లు లేనందున ఆ వ్యవస్థపై మోయలేనంత భారం పడుతుందన్నారు. వ్యవస్థను వందరెట్లకు పైగా బలోపేతం చేయకపోతే ఈ బిల్లు ప్రయోజనం నెరవేరదని చెప్పారు. కమ్యూనిటీ మీడియేషన్ ఈ బిల్లులోని ప్రధాన అంశాల్లో ఒకటని, సున్నితమైన రాజకీయ అంశాలు ఇమిడి ఉండే కేసుల పరిష్కారం కమ్యూనిటీ మీడియేషన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని చెప్పారు. ఇదే బిల్లుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రీ లిటిగేషన్ మీడియేషన్ మాండేటరీపై కేంద్రానికి పలు సూచనలు చేశారు. ప్రీ లిటిగేషన్ మీడియేషన్‌కు తగిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
జీవవైవిధ్య పరిరక్షణకు తగినన్ని నిధులేవి?
విస్తారమైన జీవవైవిధ్యం ఉన్న దేశంలో దాని పరిరక్షణకు ఏటా కేంద్ర ప్రభుత్వం రూ.7 కోట్లు మాత్రమే కేటాయిస్తోందని విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో జీవవైవిధ్య సవరణ బిల్లుపై ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తించిన 34 జీవవైవిధ్య హాట్‌స్పాట్లలో నాలుగు మనదేశంలో ఉన్నాయని చెప్పారు. ఈ నాలుగు హాట్‌స్పాట్స్‌లో 90 శాతం ప్రాంతం కోల్పోయినట్లుగా డేటా చెబుతోందన్నారు. వీటి పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని కోరారు. ప్రపంచం మొత్తం మీద నమోదైన జీవరాశుల్లో 96 వేల జాతులు భారత్‌లోనే ఉన్నాయని తెలిపారు.
47 వేల వృక్షజాతులు, ప్రపంచంలోకెల్లా సగం నీటి మొక్కలతో భారత్ విలక్షణమైన జీవవైవిధ్యం కలిగి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా లంకమహేశ్వరం వన్యసంరక్షణ కేంద్రం, తిరుమల, సింహాచలం గిరులతోపాటు అనేక ప్రాంతాల్లో రోగచికిత్సకు వినియోగించే అరుదైన మొక్కలున్నా యని చెప్పారు.ఇలాంటి జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకోవడానికి ప్రభుత్వం తగినన్ని నిధులతో కార్యా చరణ చేపట్టాలని ఆయన కోరారు. ఇదే బిల్లుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ అయోధ్యరామిరెడ్డి మాట్లాడుతూ వాతావరణ మార్పుల తీవ్రత జీవ వైవిధ్యంపై ప్రభావం చూపుతున్న ందున ఐక్యరాజ్యసమితి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ (సీబీడీ)లో భాగంగా దేశ అంతర్జాతీయ బాధ్యతల్లో సమన్వయం అవసరమని చెప్పారు.
జీవవైవిధ్యం, ప్రయోజనాలు రక్షించడానికి కేంద్రం చొరవ చూపాలన్నారు. బిల్లులో ప్రయోజనం – భాగస్వామ్య నిబంధనలు నిర్ణయించడంలో స్థానిక సంఘాల ప్రత్యక్ష పాత్రను తీసివేయడం సరికాదని చెప్పా రు. పరిహారం విషయాల్లో జరిమానా ఎలా అంచనా వేయాలనే దానిపై న్యాయనిర్ణయ అధికారికి మార్గద ర్శకత్వం లేకపోవడం సమస్యలకు తావిచ్చేలా ఉందన్నారు. న్యాయమూర్తులు, లేదా కోర్టులకు కాకుండా ప్రభుత్వ అధికారులకు ఆ తరహా అధికారం అవసర మా అనే ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నందున బిల్లులో ఆ అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు.
అటల్ జ్యోతి కింద ఏపీలో 5,500 సోలార్ వీధిలైట్లు
అటల్ జ్యోతి యోజన ఫేజ్–2 కింద ఆంధ్రప్రదేశ్‌లో యాస్పిరేషనల్ జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నాల్లో 5,500 సోలార్ వీధిలైట్లు అమర్చినట్లు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్.కె.సింగ్ తెలిపారు. విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. అటల్ జ్యోతి పథకం మొదటి ఫేజ్‌లో ఆమోదిత రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదని చెప్పారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల కలెక్టర్లు మొత్తం 5,500 సోలార్ వీధిలైట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయగా వాటిని అమర్చినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment