యూపీలోని హత్రాస్‌లో సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మృతి చెందారు. ఈ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు దేవప్రకాష్ మధుకర్ ఢిల్లీలో లొంగిపోయాడు. శుక్రవారం రాత్రి 10 గంటలకు మధుకర్‌ను యూపీ పోలీసులకు అప్పగించినట్లు సుప్రీంకోర్టు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.
రాజస్థాన్, హర్యానాతో పాటు యూపీలో మధుకర్ కోసం హత్రాస్ పోలీసులు వెదుకులాట సాగించారు. మధుకర్ లొంగిపోయిన తర్వాత అరెస్టు చేశారు. ఈ కేసులో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో చీఫ్ సేవాధర్ మధుకర్ మాత్రమే నిందితునిగా ఉన్నాడు. అతనిపై రూ.లక్ష రివార్డు ప్రకటించారు. మధుకర్ ఢిల్లీలో వైద్య చికిత్స పొందుతున్నాడని న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు. మధుకర్‌పై నేరపూరిత నరహత్య, సాక్ష్యాలను ధ్వంసం చేయడంతో పాటు ఇండియన్ జస్టిస్ కోడ్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఆగ్రా జోన్ ఏడీజీ అనుపమ్ కులశ్రేష్ట్ మాట్లాడుతూ త్వరలోనే ఈ కేసుపై సిట్ తుది నివేదికను ముఖ్యమంత్రికి అందజేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కేసులో 132 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. మరోవైపు నారాయణ్ సాకార్ విశ్వ హరి అలియాస్ భోలే బాబా ప్రమేయంపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో భోలే బాబా పేరు లేదు. కాగా దర్యాప్తునకు ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్ హత్రాస్‌కు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment