న్యూఢిల్లీ: కెనడా దేశస్తులకు వీసా సేవల పునరుద్ధరణ అంశం, ఆ దేశంలోని భారత దౌత్యవేత్తలకు కల్పించే భద్రతపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుండబద్దలు కొట్టారు. కెనడాతో దౌత్యపరమైన సమానత్వం వియన్నా సూత్రాల ప్రకారమే భారత్ కోరుతోందని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత్ నుంచి 41 మంది దౌత్యాధికారులను కెనడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో భారత్–కెనడా సంబంధాలపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
కెనడా భారత్ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కొనసాగిస్తోందనే ఆందోళనతోనే దౌత్యపరమైన సమానత్వంపై పట్టుబట్టాల్సి వస్తోందని మంత్రి వివరించారు. ‘ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. కాలక్రమంలో మరికొన్ని అంశాలు బయటకు వస్తాయి. భారత్ చర్యలపై చాలా మందికి ఎందుకు అసౌకర్యం కలిగిందనే విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు’అంటూ వ్యాఖ్యానించారు. ‘కెనడాతో సంబంధాలు ప్రస్తుతం ఇబ్బందికరంగా మారాయి.
ఆ దేశ రాజకీయాల్లోని ఒక వర్గం, దానికి సంబంధించిన విధానాలతో మాకు కొన్ని సమస్యలున్నాయి. కెనడాలోని మన దౌత్యాధికారుల భద్రత ప్రమాదంలో పడింది. అందుకే వీసాల జారీని నిలిపివేశాం. పరిస్థితుల్లో మార్పు కనిపిస్తేనే వీసాల జారీ పునరుద్ధరణ సాధ్యమవుతుంది’ అని జైశంకర్ అన్నారు. దౌత్యాధికారుల భద్రత, రక్షణ అంశం వియన్నా సూత్రాల్లో కీలకమైందని వివరించారు. జూన్‌లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఘటన వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తముందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఉద్రిక్తతలు మొదలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment