ముంబైలో బైడెన్‌ బంధువులు..! | Joe Biden spoke of Distant Relatives Living in Mumbai | Sakshi
Sakshi News home page

Published Mon, Nov 9 2020 8:43 AM | Last Updated on Mon, Nov 9 2020 9:27 AM

Joe Biden spoke of Distant Relatives Living in Mumbai - Sakshi

ముంబై: ఉత్కంఠభరితంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించారు. త్వరలోనే 46వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో బైడైన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగు చూసింది. బైడెన్‌ బంధువులు కొందరు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివాసం ఉన్నట్లు తెలిసింది. దీని గురించి గతంలో బైడెనే స్వయంగా వెల్లడించారు. 2013లో వైస్‌ ప్రెసిడెంట్‌ పర్యటనలో భాగంగా ముంబైలో ఐదుగురు బైడెన్‌లు ఉన్నారు అని తెలిపారు. భారత్‌లో ఇస్టిండియా పాలన కొనసాగుతున్న కాలంలో తన పూర్వీకులు ఇండియాలో పని చేశారని.. రిటైర్‌మెంట్‌ తర్వాత ఇక్కడే స్థిరపడ్డారని బైడెన్‌ స్వయంగా వెల్లడించారు.

బైడెన్‌ మాట్లాడుతూ.. ‘నా 29వ ఏట 1972లో తొలిసారి సెనెటర్‌గా ఎన్నికయ్యాను. ఆ సమయంలో నాకు వచ్చిన ఓ ఉత్తరాన్ని ఎప్పటికి మర్చిపోను. పేరు చివర బైడెన్‌ అని ఉన్న ఓ పెద్దమనిషి దగ్గర నుంచి నాకు ఆ ఉత్తరం వచ్చింది. నా పేరు.. ముంబైలో ఎలా అని ఆశ్యర్యపోయాను. అప్పుడు నా గ్రేట్‌ గ్రేట్‌ గ్రేట్‌ గ్రేట్‌ గ్రేట్‌ గ్రాండ్‌ఫాదర్‌ జార్జ్‌ బైడెన్‌ ఈస్ట్‌ఇండియా ట్రేడింగ్‌ కంపెనీలో కెప్టెన్‌గా పని చేశారని.. భారతీయ మహిళను వివాహామాడి ఇండియాలోనే స్థిరపడ్డారని తెలిసింది. అలా ఇండియాలో నా బంధువులు ఐదుగురు ఉన్నారనే విషయం నాకు తెలిసింది’ అన్నారు.  (చదవండి: అమెరికా ఎన్నికలు.. అరుదైన దృశ్యం!

దీని గురించి వంశవృక్ష శాస్త్రవేత్తలు ఎవరైనా పరిశోధన చేసి.. పూర్తి వివరాలు వెల్లడిస్తే బాగుంటుందని బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇక ముంబైలోని తన బంధువుల బైడెన్స్ ఫోన్ నంబర్లతో సహా ఎవరైనా తనకు వివరాలను అందించాల్సిందిగా బైడెన్‌ కోరారు. భారత-అమెరికా సివిల్ న్యూక్లియర్‌ డీల్‌ 10వ వార్షికోత్సవం సందర్భంగా 2015లో వాషింగ్టన్‌లో నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ కార్యక్రమంలో బైడెన్‌ దీని గురించి మరో సారి మాట్లాడారు.  అయితే ఇప్పటి వరకు ఆయన ముంబై బంధువులు ఎవరనేది తెలియ లేదు. అంతేకాక మేం బైడెన్‌ బంధువులమంటూ ఎవరు ప్రకటించలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement