ఆప్‌కు ఊహించని దెబ్బ | Jolt To Kejriwal: AAP Himachal State President Joins BJP | Sakshi
Sakshi News home page

ఆప్‌కు భారీ దెబ్బ.. బీజేపీలోకి కీలక చేరికలు! కేజ్రీవాల్‌ తీరువల్లే..

Published Sat, Apr 9 2022 8:26 AM | Last Updated on Sat, Apr 9 2022 2:04 PM

Jolt To Kejriwal: AAP Himachal State President Joins BJP - Sakshi

ఫుల్‌ జోష్‌లో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీకి భారీ దెబ్బ తగిలింది. హిమాచల్‌ ప్రదేశ్‌ ఆప్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనూప్‌ కేసరి.. పార్టీలో అసంతృప్తితో బీజేపీలో చేరాడు. కీలక నేతలు జేపీ నడ్డా, అనురాగ్‌ థాకూర్‌ సమక్షంలో బీజేపీలో చేరాడు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం.

ఈ ఏడాది చివర్లో(డిసెంబర్‌) లేదంటే వచ్చే ఏడాది మొదట్లో.. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపే ఆప్‌కు ఝలక్‌ ఇచ్చాడు అనూప్‌ కేసరి. ఎనిమిదేళ్లుగా ఆయన ఆప్‌ హిమాచల్‌ చీఫ్‌గా కొనసాగాడు. అయితే పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తీరును భరించలేక పార్టీని వీడుతున్నట్లు ప్రకటించాడు. అనూప్‌ కేసరితో పాటు ఆప్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌ కుమార్‌, ఉనా జిల్లా ఆప్‌ ప్రెసిడెంట్‌ ఇక్బాల్‌ సింగ్‌.. ఈ ముగ్గురు జేపీ నడ్డా సమక్షంలో కాషాయపు కండువాలు కప్పేసుకున్నారు.  

ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తీరు వల్లే తాము బీజేపీలో చేరినట్లు అనూప్‌ కేసరి ప్రకటించాడు. ఎనిమిదేళ్లుగా రాత్రింబవలు పార్టీ కోసం పని చేశాం. కానీ, పార్టీ కార్యకర్తలను ఆయన(కేజ్రీవాల్‌ను ఉద్దేశించి) చిన్నచూపు చూస్తున్నారు. ఇది ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. అందుకే పార్టీని వీడుతున్నాం అని ప్రకటించాడు అనూప్‌. మిగతా ఇద్దరు కూడా ఇదే కారణం చెప్పారు.

పంజాబ్‌ విజయోత్సవ సంబురాలు పలు రాష్ట్రాల్లో నిర్వహించింది ఆప్‌. అయితే ఏప్రిల్‌ 6వ తేదీన మండి(హిమాచల్‌ ప్రదేశ్‌)లో నిర్వహించిన రోడ్‌ షోలో రాష్ట్ర అధ్యక్షుడు అనూప్‌ కేసరిని, మిగతా కార్యకర్తల్ని పార్టీ పట్టించుకోలేదు. కేవలం కేజ్రీవాల్‌, భగవంత్‌ సింగ్‌ మాన్‌లు మాత్రమే అక్కడ హైలైట్‌ అయ్యారు.దీంతో అసంతృప్తితోనే అనూప్‌ పార్టీని వీడినట్లు స్పష్టం అవుతోంది.  

బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రి అనురాగ్‌ థాకూర్‌లు ఈ ముగ్గురిని పార్టీలోకి ఆహ్వానించారు. మాటిమాటికీ పార్టీ, పార్టీ సిద్ధాంతాలు, విలువలు.. అని డప్పు కొట్టే కేజ్రీవాల్‌.. తలపొగరుతో కార్యకర్తలను మాత్రం చిన్నచూపు చూస్తాడని అనురాగ్‌ థాకూర్‌ ఈ సందర్భంగా విమర్శించారు. ఇదిలా ఉండగా.. పంజాబ్‌ విజయం ఇచ్చిన కిక్‌తో హిమాచల్‌ ప్రదేశ్‌లోని 66 స్థానాల్లోనూ పోటీ చేయాలని ఆప్‌ భావిస్తోంది. ఈ తరుణంలో.. పార్టీ చీఫ్‌ హ్యాండివ్వడం విశేషం.

చదవండి: తెలంగాణ రాష్ట్రంలో విస్తరణకు ఆప్‌ తహతహ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement