
బనశంకరి: ఒకప్పటి కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ రాజ్‌కుమార్‌ను అపహరించిన గంథపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌కు ఆయన విడుదల కోసం కర్ణాటక సర్కారు భారీగా నగదు ముట్టజెప్పిందని ఎప్పటి నుంచో పుకార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమాచార పాత్రికేయుడు శివ సుబ్రమణ్యన్ రాసిన పుస్తకంలో పలు కొత్త అంశాలు వెలుగుచూశాయి. రాజ్‌కుమార్ విడుదల కోసం మూడు విడతులుగా మొత్తం రూ.15.22 కోట్లను అప్పటి ముఖ్యమంత్రి ఎస్‌ఎం.కృష్ణ ప్రభుత్వం వీరప్పన్‌కు అందజేసిందని పుస్తకంలో పేర్కొన్నారు. వీరప్పన్ జీవితంపై లైఫ్ అండ్ ఫాల్ ఆఫ్ వీరప్పన్ అనే పుస్తకాన్ని శివసుబ్రమణ్యన్ విడుదల చేశారు.
2000 జూలై 30 రాత్రి గాజనూరు ఫాంహౌస్ నుంచి రాజ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురిని వీరప్పన్ అపహరించి సత్యమంగళ అడవిలోకి తీసుకెళ్లాడు. 108 రోజుల తరువాత నవంబర్ 15న విడుదల చేశాడు. ఆ సమయంలో రాజ్‌కుమార్ కోసం లక్షలాదిమంది అభిమానులు పెద్దఎత్తున ధర్నాలకు దిగారు. రాజ్‌కుమార్ విడుదల కోసం మొదట డిమాండ్ చేసింది కోటి రూపాయలు. క్రమంగా ఆ మొత్తం పెరుగుతూ పోయింది. రూ.900 కోట్లు విలువచేసే బంగారం, రూ.100 కోట్ల నగదు అందించాలని డిమాండ్ పెట్టాడు. ఎస్‌ఎం కృష్ణ శాటిలైట్ ఫోన్లో వీరప్పన్‌తో చర్చలు జరిపి రెండుసార్లు రూ.5 కోట్లు చొప్పున, తుది విడతగా రూ.5.22 కోట్ల నగదును పంపించారని పుస్తకంలో తెలిపారు. కాగా, 2004, అక్టోబర్ 18న వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment