సాక్షి, బెంగళూరు : కర్ణాటక కోలార్ జిల్లాలోని ఆపిల్ ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో ఉద్యోగుల విధ్వంసం ప్రకంపనలు రేపుతోంది. వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్లాంట్ పై దాడిచేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకులు ఈ సంఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. (రూ. 440 కోట్లు నష్టం : వేలాది ఐఫోన్లు మాయం)
కోలార్ సమీపంలో ఆందోళనకారులపై విస్ట్రాన్ ప్లాంట్ యాజమాన్యం హింసాత్మకంగా దాడి చేయడం దురదృష్టకరమని, చాలా కంపెనీలు తమ పెట్టుబడులను చైనా నుండి దేశానికి తరలిస్తున్న సమయంలో, ఇటువంటి దాడులు రాష్ట్రానికి చెడ్డ పేరు తెస్తాయంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి ట్వీట్ చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు ఇది మంచి పరిణామం కాదని, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.ఆర్. సుదర్శన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్లాంట్ మళ్లీ పని ప్రారంభించే వాతావరణాన్ని సృష్టించేందుకు వీలుగా, యాజమాన్యం, కార్మికుల మధ్య చర్చలు జరగాలని, ఇందుకు ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించాలన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఐటీ మంత్రి ప్రియాంక్ ఖార్గే కూడా విస్ట్రాన్ ఫ్యాక్టరీ విధ్వంసం రాష్ట్ర ప్రతిష్టకు భంగకరమని ట్వీట్ చేశారు.
తైవాన్‌కు చెందిన విస్ట్రాన్ ప్లాంట్‌లోని కార్మికులు జీతం, ఓవర్ టైం వేతనాలు చెల్లించడంలో ఆలస్యం జరిగిందనే ఆరోపణలతో ప్లాంట్‌ఫై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన తైవాన్ టెక్‌దిగ్గజం విస్ట్రాన్ కార్పొరేషన్ డిసెంబర్ 12న కర్ణాటకలోని కోలార్ జిల్లాలోని ప్లాంట్‌లో ఉద్యోగులు సృష్టించిన విధ్వంసంలో తమకు 437 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తాజాగా ప్రకటించింది. దీనిపై విచారణకు అదనపు ఆపిల్ జట్టు సభ్యులను, ఆడిటర‍్ల బృందాన్ని పంపిస్తున్నట్లు తెలిపింది. అలాగే వేలకొద్దీ కొత్త మొబైల్ ఫోన్ యూనిట్లు, ల్యాప్‌టాప్‌లు , మానిటర్లు మాయమ్యాయని కంపెనీ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తమను తీవ్ర షాక్‌కు గురిచేసిందని, తమ ఉద్యోగుల భద్రత, శ్రేయస్సే తమకు ప్రధానమని పేర్కొంది. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తునకు స్థానిక అధికారులతో సహకరిస్తున్నట్టు వెల్లడించింది. మరోవైపు తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ (టీఐసీసీ) డైరెక్టర్ జనరల్ బెన్ వాంగ్ నేతృత్వంలోని తైవాన్‌కు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి బీఎస్ యెడ్యూరప్పతో శనివారం భేటీ అయింది. ఈ సందర్భంగా విస్ట్రాన్‌కు తమ ప్రభుత్వం తగిన రక్షణ కల్పిస్తుందని పరిశ్రమల శాఖామంత్రి జగదీష్ శెట్టర్ చెప్పారు.
కాగా ఉద్యోగుల నిరసన సంద‍్భంగా చెలరేగిన హింసను ఖండిస్తూ, అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది. హింసకు కారణమైన, ఆస్తులకు నష్టం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, ఐటీ శాఖ ఇన్‌చార్జి సీఎన్ అశ్వత్ నారాయణ్ ప్రకటించారు. దర్యాప్తు ప్రక్రియ ప్రారంభమైందని, కార్మికులకు జీతం చెల్లింపులపై ఫిర్యాదులను కూడా పరిశీలిస్తామన్నారు. విస్ట్రాన్ ప్లాంట్లో జరిగిన సంఘటన దురదృష్టకరమనీ, ఆమోదయోగ్యం కాదని మంత్రి వ్యాఖ్యానించారు.
It is unfortunate that Wistron manufacturing plant was violently attacked by agitating workers near Kolara.
— C T Ravi 🇮🇳 ಸಿ ಟಿ ರವಿ (@CTRavi_BJP) December 13, 2020
At a time when many companies are shifting base from China to India, such attacks give a bad name for the State.
I request CM @BSYBJP to order a probe into this incident.
Comments
Please login to add a commentAdd a comment