నెలకో పార్టీ పెట్టి.. మెదడును సానబెట్టి.. | Keep Your Mind Sharp | Sakshi
Sakshi News home page

నెలకో పార్టీ పెట్టి.. మెదడును సానబెట్టి..

Published Mon, Jan 8 2024 4:00 AM | Last Updated on Mon, Jan 8 2024 4:00 AM

Keep Your Mind Sharp - Sakshi

నూతన సంవత్సరం వచ్చింది.. ‘ఇకపై రోజూ వ్యాయామం చేస్తా.. పొద్దున్నే లేచి బుక్స్‌ పట్టుకుంటా.. సిగరెట్‌ మానేస్తా.. మందు ముట్టుకోను..’ ఎవరికి వారు పెట్టుకునే ఇలాంటి టార్గెట్లెన్నో.. వీటిని కొద్దిరోజులు గట్టిగానే పాటించి.. ఆ తర్వాత వట్టిగానే వదిలేస్తుండటమూ కామనే. మరి ఇలా కొత్త సంవత్సరం కోసం కొత్త కొత్తగా ఎలాంటి లక్ష్యాలు పెట్టుకుంటే బాగుంటుందని ‘కృత్రిమ మేధ (ఏఐ)’ ప్రోగ్రామ్‌లను అడిగితే ఏమేం సూచించాయో తెలుసా..?  – సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

కొత్తగా ఏం చేస్తే బాగుంటుందని? 
ఇటీవల ఏఐ ప్రోగ్రామ్‌ల వినియోగం పెరిగిపోయింది. ఫొటోలను, వీడియోలను సృష్టించడం నుంచి కంప్యూటర్‌ కోడ్‌లను రాసిపెట్టడం, కెరీర్‌ సలహాల దాకా ఎన్నో పనులకు ఏఐని వాడేస్తున్నారు. ఈ క్రమంలో డెయిలీమెయిల్‌ వెబ్‌సైట్‌.. గూగుల్‌కు చెందిన ‘బార్డ్‌’, మైక్రోసాఫ్ట్‌ బింగ్‌కు అనుసంధానం చేసిన ‘చాట్‌జీపీటీ’, అమెజాన్‌ సహకారంతో అభివృద్ధి చేసిన ‘క్లాడ్‌’ఏఐ ప్రోగ్రామ్‌లను విభిన్నమైన ప్రశ్న అడిగింది. ఈ 2024 సంవత్సరంలో.. విభిన్నమైన లక్ష్యాలను సూచించాలని, అయితే అవి సులువుగా సాధించగలిగేలా ఉండాలని కోరింది. దీనికి ఏఐ ప్రోగ్రామ్‌లు నిజంగానే వినూత్న ఐడియాలు ఇచ్చాయి. 

కృత్రిమ మేధ అంటేనే డిజిటల్‌ ప్రోగ్రామ్‌లు. అయినా సాంకేతికతకు దూరంగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలంటూ సూచనలు చేయడం గమనార్హం. 

నెలకో డిన్నర్‌ థీమ్‌ పార్టీ 
ప్రతినెలా ఓ రోజు విభిన్నమైన థీమ్‌తో డిన్నర్‌ పార్టీ చేసుకోవాలని గూగుల్‌ బార్డ్‌ సూచించింది. ‘‘పురాతన విందుల నుంచి స్పేస్‌లో ప్రయాణం దాకా భిన్నమైన థీమ్‌లు పెట్టుకుని డిన్నర్‌ పార్టీ చేసుకోండి. ప్రతిసారి సరికొత్త వంటకాలను ప్రయత్నించండి. ఇలాంటి పారీ్టల వల్ల స్నేహం, బంధాలు బలపడతాయి. ఒత్తిళ్లు దూరమవుతాయి..’’అని పేర్కొంది. 

మీ కుటుంబ మూలాల్లోకి వెళ్లండి 
‘‘మీ కుటుంబం మూలాల్లోకి వెళ్లండి. దూరపు బంధువులు, పెద్దలను కలసి కుటుంబ చరిత్రను, పూరీ్వకుల ఘనతను తెలుసుకోండి. ఫ్యామిలీ ట్రీని రూపొందించుకోండి. మీకు ఎన్నో ఉత్కంఠ భరిత అంశాలు తెలియవచ్చు. అంతా సరికొత్తగా ఉంటుంది..’’అని గూగుల్‌ బార్డ్‌ సూచించింది. 

వారానికోసారి చేతి రాతతో లెటర్‌ రాయండి 
ప్రతి వారం చేతిరాతతో కూడిన లేఖలు రాసే అలవాటు చేసుకోవాలని క్లాడ్‌ ఏఐ సూచించింది. ‘‘దూరంగా ఉన్న బంధువులు, స్నేహితులకు ఒకప్పటి తరహాలో చేతి రాతతో లెటర్లు రాయండి. మీ అనుభూతులను, ఆలోచనలను అందులో పంచుకోండి. ఈ అనుభవం ఎంతో బాగుంటుంది’’అని క్లాడ్‌ పేర్కొంది. 

‘డిజిటల్‌ డిటాక్స్‌’ మొదలుపెట్టండి 
కొత్త సంవత్సరం సందర్భంగా డిజిటల్‌ పరికరాలకు దూరంగా ఉండే (డిజిటల్‌ డిటాక్స్‌) తీర్మానం చేసుకోవాలని చాట్‌జీపీటీ పేర్కొంది. ‘‘వారంలో ఒక రోజు లేదా రోజులో కొన్ని గంటల పాటు ఫోన్, టీవీ, కంప్యూటర్‌ వంటి ఎలాంటి డిజిటల్‌ పరికరాలు వాడొద్దన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఆ సమయంలో పుస్తకాలు చదవడం, మెడిటేషన్, ప్రకృతిలో గడపడం వంటివి చేయండి..’’అని సూచించింది. 

వారానికో రోజు పూర్తి వెజ్‌.. 
మీ ఆహార అలవాట్లను నియంత్రించుకుని, వా­రా­నికి ఓ రోజు పూర్తిగా శాఖాహారమే తీసుకునేలా లక్ష్యాన్ని పెట్టుకోవాలని ‘చాట్‌జీపీటీ’సూచించింది. ‘‘వారానికి ఒక రోజు పూర్తిగా వెజ్‌. అందులోనూ ఎప్పటికప్పుడు కొత్త వంటకాలు, రుచులను ఆస్వాదించండి. ఇది మీకు ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుతుంది. పర్యావరణానికీ ఎంతో మంచిది..’’అని పేర్కొంది. 

కొత్త ఏడాది కోసం ‘ఏఐ’ చెప్పిన సరికొత్త లక్ష్యాలు 
మీకు నచ్చిన అంశంపై రోజుకో వాక్యం 
‘‘మీకు నచ్చిన, బాగా ఆసక్తి ఉన్న అంశంపై డైరీ లాంటి ఓ జర్నల్‌ను మొదలుపెట్టండి. అందులో రోజుకు కనీసం ఒక్క వాక్యాన్ని తప్పనిసరిగా రాస్తూ వెళ్లండి. కొంతకాలానికి ఈ జర్నల్‌ ఎంతో ఆలోచనాత్మకంగా రూపుదిద్దుకుంటుంది..’’అని చాట్‌జీపీటీ సూచించింది. 

చిన్ననాటి భయాన్ని దూరం చేసుకోండి 
ప్రతి ఒక్కరికీ చిన్ననాటి భయాలు కొన్ని ఉంటాయి. నదులు, సముద్రాల్లోకి దిగడానికి.. రోలర్‌ కోస్టర్, జెయింట్‌ వీల్‌ వంటివి ఎక్కడానికి భయపడుతుంటారు. పబ్లిక్‌ మీటింగ్‌లలో మాట్లాడటానికి మొహమాటపడతారు.. సాలె పురుగులు, బల్లులను చూస్తే దూ­రంగా పరుగెడతారు. ఇలాంటి వాటిని వదిలించుకునేలా కొత్త సంవత్సరం ప్రయత్నించాలని క్లాడ్‌ ఏఐ సూచించింది. 

ఖర్చులకు బడ్జెట్‌.. పొదుపుపై ఫోకస్‌ 
ఈ ఏడాది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని బింగ్‌–చాట్‌జీపీటీ పేర్కొంది. ‘‘ప్రతి ఖర్చును నమోదు చేస్తూ బడ్జెట్‌ రూపొందించుకోండి, కచ్చితంగా డబ్బును పొదుపు చేయండి, జాగ్రత్తపడుతూ స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి’’అని సూచించింది. 

మెదడును సానబెట్టండి కొత్త సంవత్సరంలో మీ మెదడుకు పనిచెప్పి, చురుగ్గా ఉండేలా ప్రయత్నించాలని గూగుల్‌ బార్డ్‌ సూచించింది. ఏదైనా ఒక తేదీ చెప్తే.. అది ఏ వారమో చెప్పగలిగేలా ప్రయత్నం చేయాలని.. ఇది చూసి అంతా ఆశ్చర్యపోతారని పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement