
తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం పేరును మారుస్తూ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టారు. అందుకు అధికార ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి.
ఈ తీర్మానాన్నిరాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపుతుంది. కేంద్రం అనుమతి ఇస్తే త్వరలో కేరళ కాస్త.. కేరళంగా మారనుంది. అందుకు త్వరలో విధివిధానాలు అమలు కానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కేరళ ప్రభుత్వం రాష్ట్రం పేరును మార్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కానీ కొన్ని టెక్నికల్ అంశాల కారణంగా కేంద్రం అందుకు ఒప్పుకోలేదు.
తాజాగా, మరోసారి రాష్ట్రం పేరును మార్చే ప్రతిపాదనను సీఎం విజయన్ తెరపైకి తెచ్చారు. అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రాన్ని మలయాళంలో కేరళ అని పిలిచేవారని, మలయాళం మాట్లాడే వారి కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలనే డిమాండ్ స్వాతంత్ర్య పోరాట కాలం నుంచి బలంగా ఉందని సీఎం చెప్పారు.
రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో తమ రాష్ట్రం పేరు కేరళ అని రాసి ఉందని, దానిని కేరళంగా సవరించాలని కేంద్రాన్ని కోరారు. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో ‘కేరళ’ పేరును ‘కేరళం’ మార్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ తీర్మానం చేసినట్లు చెప్పారు.
అంతేకాదు భారత రాజ్యంగంలో ఆర్టికల్ 3 కింద కేరళ పేరును కేరళంగా మార్చాలని, అందుకు రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా మద్దతు పలికిందని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment