కారుపై వాలాడని ఓ చిన్నారిని దూషించడంతో పాటు అతన్ని కాలితో గట్టిగా తన్నాడు ఓ వ్యక్తి. దీంతో పాపం ఆ పిలగాడు అమాయకంగా అక్కడి నుంచి కిక్కురుమనకుండా పక్కకు తప్పుకున్నాడు. అయితే దుర్మార్గాన్ని అక్కడే ఉన్న కొందరు మాత్రం ఊరుకోలేదు.
కేరళలో తాజాగా ఈ ఘటన జరిగింది. చిన్నారిపై దాడి జరిగిన వెంటనే అక్కడే ఉన్న కొందరు యువకులు, మరికొందరు ఆ కారు చుట్టూ చేరారు. చిన్నారిని తన్నిన వ్యక్తిని నిలదీసి.. వాగ్వాదానికి దిగారు. అయితే అది తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయాడు ఆ వ్యక్తి.
బాధిత చిన్నారి రాజస్థాన్‌కు చెందిన వలసకూలీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. పొన్నియపాలెంకు చెందిన షిహ్‌షద్‌గా నిందితుడిని గుర్తించారు పోలీసులు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ యువలాయర్.. పోలీసుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు. అయినా పోలీసుల నుంచి సరైన స్పందన రాలేదు.
ఈలోపు సోషల్ మీడియా ద్వారా సీసీటీవీ ఫుటేజీ వైరల్ కావడంతో.. చర్యలు తీసుకోని పోలీసులపై పలువురు నెటిజన్లు మండిపడ్డారు. దీంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చింది. అయితే రాత్రికి రాత్రే అతన్ని మళ్లీ రిలీజ్ చేశారన్న కథనాలతో జనాల్లో ఆగ్రహం పెల్లుబిక్కింది. దీంతో కేరళ అసెంబ్లీ స్పీకర్, ఏఎన్ షంసీర్ ఈ ఘటనపై స్పందించాడు.
నిందితుడిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టాలని, కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి శివన్‌కుట్టీ.. మానవత్వం దుకాణాల్లో దొరికేది కాదంటూ వ్యాఖ్యానించారు. ఆరేళ్ల బాలుడు కారు మీద వాలిపోయాడని తన్నడం ఏంటి?. న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారాయన.
Comments
Please login to add a commentAdd a comment