
వృద్ధురాలికి కాలేయ భాగం ఇచ్చిన మహిళా లెక్చరర్
ఆకస్మికంగా మృత్యువాత
బొమ్మనహళ్లి: ఓ మహిళ సామాజిక సేవలో ముందుంటారు. ఎవరికి కష్టం వచ్చినా సహాయంగా నిలుస్తారు. అదే మాదిరిగా బంధువుకు కాలేయం పాడైపోతే, సదరు మహిళ తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేసి గొప్ప మనసును చాటుకుంది. కానీ ఆరోగ్యం విషమించి ఆమే ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక సంఘటన బెంగళూరులో జరిగింది. మృతురాలు అర్చనా కామత్ (34).
బంధువుకు బాగా లేదంటే..
వివరాలు.. ఉడుపికి చెందిన అర్చనా కామత్ మంగళూరులో ఓ మేనేజ్‌మెంట్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. తమ బంధువైన వృద్ధురాలు (69)కి కాలేయం పాడైపోయి ఆస్పత్రిలో చేరింది. ఆరోగ్యకర వ్యక్తి నుంచి కొంత కాలేయ భాగం తీసి అమర్చితే కోలుకోవచ్చని వైద్యులు సూచించారు. అనేకమందికి రక్త పరీక్షలు చేసినా సరిపోలేదు. అర్చన బ్లడ్ గ్రూప్‌తో సరిపోయింది. దీంతో అర్చన కాలేయ దానానికి ముందుకొచ్చింది.
12 రోజుల క్రితం బెంగళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అర్చనకు శస్త్రచికిత్స చేసి లివర్ భాగాన్ని తీసి వృద్ధురాలికి అమర్చారు. మూడురోజుల తరువాత అర్చన డిశ్చార్జ్ అయింది. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అర్చనకు రెండురోజుల కిందట ఆకస్మాత్తుగా ఆరోగ్యం విషమించడంతో వెంటనే బెంగళూరులో ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స ఫలించక కన్నుమూసింది. ఆమెకు భర్త చేతన్ కామత్ తో పాటు నాలుగేళ్ల తనయుడు ఉన్నారు. ఆమె లివర్‌ను పొందిన వృద్ధురాలు మాత్రం ఆరోగ్యంగా ఉండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment