
లక్నో: కేంద్ర మాజీ మంత్రి స్వామి చిన్మయానంద లైంగిక దాడి కేసు కీలక మలుపు తిరిగింది.. చిన్మయానంద తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ గతేడాది ఆరోపించిన లా విద్యార్థిని తాజాగా యూటర్న్ తీసుకుంది. ఆయన తనపై లైంగిక దాడికి పాల్పడలేదని కోర్టు ముందు పేర్కొంది. దాంతోపాటు ఆయనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఆమె కేసు వాపస్ తీసుకోవడానికి గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.
షహజాన్‌పూర్‌లో చదువుతున్న లా విద్యార్థిని గతేడాది ఆగస్టులో కనిపించకుండా పోయింది. తరువాత తిరిగి వచ్చిన ఆమె మాజీ మంత్రి చిన్మయానందపై లైంగిక ఆరోపణలు చేసింది. చాలా పోరాటాలు జరిగిన తరువాత గతేడాది సెప్టెంబర్‌లో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అలహాబాద్ హైకోర్టులో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక బ్రాంచ్ ఈ కేసు విచారణను చేపట్టింది. ఫిబ్రవరిలో చిన్మయానంద బెయిల్‌పై బయటకు వచ్చారు.
మంగళవారం ఈ కేసు విచారణకు రాగా, చిన్మయానంద తనపై ఎలాంటి లైంగిక దాడికి పాల్పడలేదని విద్యార్థిని కోర్టుకు తెలిపింది. అయితే మాజీ మంత్రి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ గతంలో ఆరోపించిన విద్యార్థిని తాజాగా మాట మార్చడంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. న్యాయ విద్యార్థిని మాట మార్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: బెయిల్‌పై వచ్చి ఘనంగా బర్త్‌డే
Comments
Please login to add a commentAdd a comment