
హిమాచల్ ఎన్నికల ప్రచారంలో సరికొత్త తిట్ల దండకం
సిమ్లా: ఎన్నికలన్నాక పరస్పర విమర్శలు సహజమే. కానీ హిమాచల్‌ప్రదేశ్ ప్రచారంలో అభ్యర్థులు విమర్శలు దాటి.. వ్యక్తిగత తిట్ల వరకూ వచ్చేశారు. ఈ దండకంలో కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకూ అందరూ ఆ తాను ముక్కలే. ఒకరు ‘కాలే నాగ్’ అంటే.. మరొకరు ‘బిగ్డా షెహజాదా’ అంటూ ప్రచార పదజాలంలో కొత్త తిట్లను చేరుస్తున్నారు.
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేసిన విషయం తెలిసింది. వారిపై అనర్హత వేటు పడి ఆ ఆరుస్థానాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు.. పార్టీ తిరుగుబాటుదారులను ‘కాలే నాగ్’(నల్లత్రాచు)లు, బికావు (అమ్ముడుపోయినవాళ్లు) అంటూ విమర్శించారు.
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి దేవేందర్ కుమార్ భుట్టో నియోజకవర్గమైన కుట్లేహార్‌లో సీఎం మాట్లాడుతూ.. ‘భుట్టో కో కూటో’ (భుట్టోను కొట్టండి) అంటూ పిలుపునిచ్చారు. సుఖూ వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయంటూ బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. ఇక ‘మండీ మే భావ్ క్యా చల్ రహా హై’ అంటూ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతే చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి.
నేను రెండాకులు ఎక్కువే చదివానంటూ రనౌత్ చెలరేగిపోయారు. రాహుల్‌గాం«దీ, విక్రమాదిత్య పేర్లు చెప్పకుండా.. ‘బడా పప్పు’, ‘ఛోటా పప్పు’ అని పదేపదే వాడారు. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పారీ్ట.. ఈ దేశానికి బ్రిటిష్ వాళ్లు వదిలి వెళ్లిన ‘రోగం’ అంటూ వ్యాఖ్యానించారు. 2014 వరకు చెద పురుగుల్లా దేశాన్ని తినేశారన్నారు.
విక్రమాదిత్యను.. ‘బిగ్డా షెహజాదా’ (చెడిపోయిన యువరాజు) అంటూ సంబోధించారు. ఇక కంగనాను ‘ఆమె హుస్న్ కి పరి’ (అప్సరస) అని, ప్రజలు ఆమెను చూడటానికి మాత్రమే వస్తారు.. ఓట్లేయరని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ వ్యాఖ్యానించారు. దీనిపై కంగనా తల్లి ఆశా రనౌత్ స్పందించారు. తన కూతురును ‘అప్సరస’, ‘క్యా చీజ్ హై’ అంటున్నవాళ్లు తమ ఇళ్లలో ఆడపిల్లలున్నారన్న విషయం మరుస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment