మండి లోక్‌సభ స్థానంలో ఆసక్తికర పోరు
కంగనా, విక్రమాదిత్య సింగ్ హోరాహోరీ
హిమాచల్‌ప్రదేశ్‌లో రాజవంశీయుల కంచుకోట అయిన మండి లోక్‌సభ స్థానంలో ‘కింగ్’, ‘క్వీన్’ మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. క్వీన్ తదితర సినిమాలతో అలరించిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ తరఫున ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. రాంపూర్ బుషహర్ రాజ సంస్థాన వారసుడు విక్రమాదిత్యసింగ్ కాంగ్రెస్ అభ్యరి్థగా ఆమెతో తలపడుతున్నారు. దాంతో ఇక్కడ విజయం రెండు పారీ్టలకు ప్రతిష్టాత్మకంగా మారింది...
తొలి నుంచీ రాజులే...
పారీ్టలేవైనా మండిలో రాజకుటుంబీకుల హవాయే కొనసాగుతూ వస్తోంది. రెండు ఉప ఎన్నికలతో సహా 19సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగితే 13సార్లు రాజ కుటుంబీకులే గెలిచారు. కాంగ్రెస్‌కు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. పీసీసీ చీఫ్, సిట్టింగ్ ఎంపీ ప్రతిభా సింగ్ ఈసారి పోటీ చేయబోనని ప్రకటించారు.
బీజేపీ నుంచి కంగనా బరిలో దిగడంతో తనయుడు విక్రమాదిత్య సింగ్‌ను బరిలో దించారు. ఆయన సిమ్లా (రూరల్) నుంచి రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. ఆయన తండ్రి వీరభద్రసింగ్ ఏకంగా ఆరుసార్లు రాష్ట్ర సీఎంగా చేశారు. తల్లిదండ్రులిద్దరూ మండి లోక్‌సభ స్థానం నుంచి మూడేసిసార్లు నెగ్గారు. 2021 మండి ఉపఎన్నికలో తల్లి కోసం విక్రమాదిత్య విస్తృతంగా ప్రచారం చేశారు.
కంగనాకు ఆదరణ...
కంగనాకు ఊహించని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నాయకుడు జైరాం ఠాకూర్ మద్దతుతో పాటు మండి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లన్నీ బీజేపీ చేతిలోనే ఉండటం ఆమెకు కలిసొచ్చే అంశాలు. తొలుత ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన సీనియర్ నేత మహేశ్వర్ సింగ్ తర్వాత మనసు మార్చుకున్నారు. కార్గిల్ యుద్ధ వీరునిగా స్థానికంగా బాగా ఆదరణ ఉన్న బ్రిగేడియర్ (రిటైర్డ్) ఖుషాల్ ఠాకూర్, కేంద్ర మాజీ మంత్రి సుఖ్‌రామ్ మనవడు ఆశ్రయ్ శర్మ తదితరులు కంగనాకు మొదటినుంచి మద్దతిస్తున్నారు.
పరస్పర విమర్శలు...
పరస్పర విమర్శల్లో కంగనా, విక్రమాదిత్య ఇద్దరూ హద్దులు దాటిపోయారు. ఎన్నడూ లేనంతగా వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై కంగనాకు ఎలాంటి విజన్ లేదని, ఆమె కేవలం పొలిటికల్ టూరిజం చేస్తున్నారని విక్రమాదిత్య ఎద్దేవా చేస్తుంటే, ఆయనను ‘చోటా పప్పు’ అంటూ కంగనా ఎగతాళి చేస్తున్నారు. రైతులపై కంగనా అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో సంయుక్త కిసాన్ మంచ్ విక్రమాదిత్యకు మద్దతిస్తోంది.
హిమాచల్‌లో విపత్తు వేళ బాధితుల పట్ల కంగనా సానుభూతి చూపలేదని, మండిని కనీసం సందర్శించలేదని విమర్శలున్నాయి. ఒక్కసారి చాన్సిస్తే నియోజకవర్గ ప్రజల కోసం పనిచేస్తానని కంగనా అంటున్నారు. గిరిజన ప్రాంతాలకు కనెక్టివిటీ మెరుగుపరచడం, ఆగిన ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు స్థానిక సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ పర్యాటకాన్నీ ప్రోత్సహిస్తానని హామీ ఇస్తున్నారు. మండీని స్మార్ట్ సిటీగా మారుస్తానని విక్రమాదిత్య వాగ్దానం చేస్తున్నారు.
‘మండి’ ప్రస్థానం..
మండిని ఒకప్పుడు మండి మహాసు నియోజకవర్గంగా పిలిచేవారు. ఆరు జిల్లాల్లో విస్తరించిన ఈ నియోజకవర్గంలో 13,77,173 మంది ఓటర్లున్నారు. దీని పరిధిలో ఏకంగా 17 అసెంబ్లీ సెగ్మెంట్లుండటం విశేషం. వీరభద్రసింగ్ 1971లో తొలిసారి ఇక్కడి నుంచి గెలిచారు. 1977లో ఎమర్జెన్సీ వ్యతిరేక వెల్లువలో ఓటమి చవిచూసినా 1980లో మళ్లీ విజయం సాధించారు. 1989లో బీజేపీ, 1991, 1996ల్లో కాంగ్రెస్, 1998, 1999 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాయి. 2004లో ప్రతిభా సింగ్ తొలిసారి గెలిచారు. 2009లో మళ్లీ వీరభద్రసింగ్ విజయం సాధించారు. ఆయన సీఎంగా కావడంతో 2013లో జరిగిన ఉప ఎన్నికలో ప్రతిభాసింగ్ నెగ్గారు. 2014, 2019ల్లో బీజేపీకి చెందిన రామ్ స్వరూప్ శర్మ గెలుపొందారు. 2021లో ఆయన మరణంతో జరిగిన ఉప ఎన్నికలో మళ్లీ ప్రతిభా సింగ్ గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment