
భోపాల్: కరోనా వైరస్ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తోంటే.. దీన్ని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. సాధారణ జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో ఆస్పత్రికి వెళ్తే కరోనా పేరు చెప్పి వేలకు వేలు వసూలు చేస్తోన్న వైనాన్ని చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఆరోగ్య శాఖ సాంకేతిక నిపుణుడు తమ ప్రాంతంలోని ల్యాబ్‌పై అనేక ఆరోపణలు రావడంతో వాస్తవాలు ఏంటో తేల్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఓ నలుగురి శాంపిల్స్ టెస్ట్‌కు పంపాడు. సదరు ల్యాబ్ ఏకంగా దాదాపు 15 మందికి కరోనా పాజిటివ్‌గా తేల్చింది. దాంతో ప్రస్తుతం ఈ ల్యాబ్‌లో టెస్ట్ చేయించుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. వివరాలు ధార్ జిల్లా తానా గ్రామానికి చెందిన గుమాన్ సింగ్ అనే వ్యక్తి తమ ప్రాంతంలో కరోనా టెస్ట్‌లు చేస్తోన్న ల్యాబ్‌పై అనేక ఆరోపణలు రావడం విన్నాడు. దాంతో టెస్ట్ చేద్దామని భావించి గ్రామంలోని ఓ నలుగురి స్వాబ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపాడు. వీటిని పరీక్షించిన సదరు పరీక్షా కేంద్రం ఏకంగా 15 మందికి కరోనా పాజిటివ్‌గా తేల్చింది. (చదవండి: ప్రైవేట్ ఆసుపత్రులకు... భారీగా అనుమతులు)
విశేషం ఏంటంటే వారిలో చాలా మంది శాంపిల్స్ తీసుకున్న రోజు గ్రామంలో లేరు. ఈ రిపోర్టు చూసిన జనాలు షాక్‌కు గురయ్యారు. అసలు తాము ఎలాంటి శాంపిల్స్ ఇవ్వకుండానే పాజిటివ్ రిపోర్టులు రావడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ విషయం గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విషయం కాస్త సీరియస్ కావడంతో అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ఈ సందర్భంగా గుమాన్ మాట్లాడుతూ.. ‘నేను శాంపిల్స్‌ని మార్చేశాను. ఓ 20 టెస్టింగ్ కిట్లను ల్యాబ్‌కు పంపాను. వాటిలో ఎలాంటి శాంపిల్స్ లేవు. వాటిని నీటిలో ముంచి టెస్ట్‌కు పంపాను’ అని తెలిపాడు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు గుమన్‌తో పాటు బ్లాక్ కమ్యూనిటీ మొబిలైజర్ బచ్చన్ ముజల్దా సర్వీసులను నిలిపివేశారు. ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ను పంపినట్లు ధార్ జిల్లా కలెక్టర్ అలోక్ కుమార్ సింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment