వైరల్‌: లవర్‌ను కలిసేందుకు వచ్చి బుక్కైన ప్రియుడు | UP: Man Disguises Himself As A Woman To Sneak Into Girlfriends House | Sakshi
Sakshi News home page

వధువు వేషంలో వచ్చి షాకిచ్చిన లవర్‌

Jun 3 2021 1:27 PM | Updated on Jun 3 2021 2:15 PM

UP: Man Disguises Himself As A Woman To Sneak Into Girlfriends House - Sakshi

వధువు వేషంలో వచ్చిన యువకుడిని నిలదీస్తున్న అమ్మాయి కుటుంబసభ్యులు

సినిమాలో మాదిరి సీన్‌ నిజ జీవితంలో జరగడంతో ఆ వీడియో వైరలయ్యింది. ప్రేమ కోసం అబ్బాయి చేసిన ప్రయత్నం నవ్వులు తెప్పిస్తోంది.. మీరు చదివేయండి.

లక్నో: ప్రేమించుకున్నారు.. వారి ప్రేమ విషయం అమ్మాయి ఇంట్లో తెలిసిపోయింది. దీంతో అతడి నుంచి ఆమెను దూరం చేశారు. అమ్మాయిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా చేశారు. దీంతో ఆ యువకుడు తన ప్రేయసిని కలిసేందుకు అన్నీ విధాల ప్రయత్నించాడు. చివరకు ఇలా అయితే కుదరదని వేషం మార్చాడు. అబ్బాయి కాస్త అమ్మాయిలా తయారై తన లవర్‌ ఇంటికి వెళ్లాడు. అయితే అక్కడే తప్పు చేశాడు.

బదౌహీ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు ప్రేమించుకున్నారు. తరచూ వీరిద్దరు కలుసుకుంటుండడంతో అమ్మాయి ఇంట్లో తెలిసింది. తన ప్రేయసిని ఎలాగైనా చూడాలని ఆ యువకుడు పై విధంగా చేశాడు. అచ్చం అమ్మాయి మాదిరి తయారయ్యాడు. జుట్టు మొదలుకుని వస్త్రధారణ, పాదరక్షలు, అమ్మాయిలు వాడే వస్తువులు ఇలా మొత్తం అమ్మాయి మాదిరి తయారయ్యాడు. అయితే సాధారణంగా తయారైతే ఎవరూ గుర్తు పట్టకపోయి ఉండవచ్చు. కానీ నవ వధువు మాదిరి తయారై తమ ఇంటికి రావడంతో కుటుంబసభ్యులు అనుమానించారు. ఏం కావాలి అని ప్రశ్నించగా తన ప్రేయసి పేరు చెప్పాడు. అయితే అప్పటికే కుటుంబసభ్యులు గుమిగూడడంతో అతడు కొంత కంగారుపడ్డాడు. ఈ క్రమంలో ముఖం కనిపించకుండా చున్నీ వేసుకుంటుండడంతో జుట్టు పక్కకు జరిగింది. ముఖం చూపించాలని కుటుంబీకులు పట్టుబట్టి తీసేందుకు ప్రయత్నించగా జుట్టు కిందపడిపోయింది. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

చున్నీ తీసి చూడగా ఆ యువకుడు కనిపించాడు. వెంటనే ఆ యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్త చదివిన వారంతా పగలబడి నవ్వుకుంటున్నారు. మరికొందరు జాలి పడుతున్నారు. ఇంకొందరు ప్రేమ కోసం ఈ మాత్రం తిప్పలు పడాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. ఏమున్నా ఆ అమ్మాయి కోసం అంత కష్టపడ్డాడంటే ఆ అబ్బాయి అమ్మాయిని ఎంత ప్రేమిస్తున్నాడోనని నెటిజన్లు చెబుతున్నారు. ఇచ్చేయండి మీ పిల్లను అని సూచనలు చేస్తున్నారు. సినిమాలో మాదిరి సీన్‌ నిజ జీవితంలో జరగడంతో ఆ వీడియో వైరలయ్యింది. మీరు చూసేయండి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement