కరోనా: ఆర్‌- వాల్యూ తక్కువగా ఉందంటే.. | Massive Dip New Corona Cases And Mortality Rate In Delhi | Sakshi
Sakshi News home page

కరోనా కట్టడిలో ఢిల్లీ సక్సెస్‌ అయిందా? ఎలా?

Published Tue, Aug 4 2020 12:36 PM | Last Updated on Tue, Aug 4 2020 4:23 PM

Massive Dip New Corona Cases And Mortality Rate In Delhi - Sakshi

న్యూఢిల్లీ: మహమ్మారి క‌రోనా వ్యాపించిన తొలి నాళ్లలో భారీ స్థాయిలో పాజిటివ్‌ కేసుల నమోదైన దేశ రాజధానిలో వైరస్‌ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జూన్‌ 23 నాటి వరకు ఒక్కరోజులోనే 3 వేలకు పైగా కేసులు వెలుగులోకి రాగా.. రెండు నెలల్లో ఆ సంఖ్య వెయ్యికి పడిపోయింది. ఇక సోమవారం కొత్తగా 805 మందికి కరోనా సోకగా.. 17 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తంగా కోవిడ్‌-19 కేసుల సంఖ్య లక్షా ముప్పై ఎనిమిది వేలు దాటగా.. కరోనా మృతుల సంఖ్య 4,021కి చేరింది. ఈ నేపథ్యంలో రోజూవారీ  క‌రోనా కేసుల విష‌యంలో మిగ‌తా  రాష్ర్టాల‌తో పోలిస్తే ఢిల్లీ 12వ స్థానానికి ప‌డిపోయిందని ఆరోగ్య‌శాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్‌ ఇటీవల పేర్కొన్నారు. మరి గణాంకాలు ఏం చెబుతున్నాయి, ఆగష్టు 2 నాటికి మిగతా కరోనా ప్రభావిత ప్రాంతాలతో పోలిస్తే దేశ రాజధానిలో పరిస్థితి ఎలా ఉందో ఓసారి గమనిద్దాం.(24 గంటల్లో 52 వేలకు పైగా కరోనా కేసులు)

రోజూ వారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల
జూన్‌ 28 నాటికి ఢిల్లీలో రోజుకు సగటున 3333 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. జూలై 5 నాటికి ఈ సంఖ్య 2338కి తగ్గింది. ఇక జూలై రెండో వారం నాటికి పరిస్థితి మరింత మెరుగు పడింది. జూలై 12 నాటికి సగటున 1861, జూలై 19 నాటికి 1471కి తగ్గింది. ఆగష్టు 2 నాటికి ఈ సంఖ్య 1010కి చేరుకోవడంతో కరోనా కేసుల సంఖ్యలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. దేశ వ్యాప్తంగా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఇతర రాష్ట్రాలు(కరోనా ప్రభావిత), ప్రధాన పట్టణాలతో పోలిస్తే ఈ సగటు చాలా తక్కువ.

వాణిజ్య రాజధాని ముంబైలో జూన్‌ 29 నుంచి ఆగష్టు 2 నాటికి సగటున 1311 నుంచి 1039 కేసులు నమోదు కాగా, చెన్నైలో రోజుకు సగటున 1888 నుంచి 1037 మంది కరోనా బారిన పడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జూన్‌ చివరి వారం నుంచి ఢిల్లీతో పాటు ముంబైలోనూ భారీ స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు కేసుల సంఖ్య తగ్గడం ఊరట కలిగించే అంశంగా పరిణమించింది.

6.04 శాతానికి పడిపోయింది!
ఎప్పటికప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ బాధితులను గుర్తించి, తీవ్రతను బట్టి ఆస్పత్రిలో చేర్పించడం లేదా హోం ఐసోలేషన్‌లో ఉంచడం వంటి చర్యలతో ఢిల్లీ కరోనా కట్టడిలో సానుకూల ఫలితాలు పొందుతోందని చెప్పవచ్చు.  దేశ రాజధానిలో ఇప్పటి వరకు దాదాపు 10 లక్షలకు పైగా కోవిడ్‌-19 టెస్టులు చేశారు. అంటే ఢిల్లీ జనాభా ప్రకారం ప్రతీ పదిలక్షల మందిలో దాదాపు 53,700 మందికి పరీక్షలు నిర్వహించారు. దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాలతో ఇది చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో ఢిల్లీలో జూలై 6 నాటికి 10.97 శాతంగా ఉన్న వీక్లీ పాజిటివిటి రేటు ఆగష్టు 2 నాటికి 6.04 శాతానికి పడిపోయింది. అంటే టెస్టులు చేయించుకున్న ప్రతీ 17 మందిలో ఒకరు మాత్రమే కరోనా బారిన పడినట్లు గణాంకాల ద్వారా వెల్లడవుంతోంది.(మాజీ సీఎంకు కరోనా పాజిటివ్)

ఇక ముంబైలో జూలై 19 నాటికి వీక్లీ పాజిటివిటి రేటు 20.15 శాతంగా నమోదు కాగా ప్రస్తుతం 10.72 శాతానికి చేరింది. ఢిల్లీతో పోలిస్తే ఇది తక్కువే. అయితే రాపిడ్ యాంటిజెన్ టెస్టింగ్ పరీక్షల్లో అధికంగా తప్పుడు ఫలితాలు వెల్లడవుతున్నప్పటికీ ఢిల్లీలో ఇంకా రాపిడ్‌ టెస్టులనే నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టు సైతం కేజ్రీవాల్‌ సర్కారుపై ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరీక్షల విధి విధానాల్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్‌) జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాజిటివిటి రేటు తగ్గడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్‌- వాల్యూ ఒకటి కంటే తక్కువగా!
కరోనా సోకిన వ్యక్తి నుంచి సగటున ఎంతమంది ఇతర వ్యక్తులకు వైరస్‌ సంక్రమించిందన్న విషయాన్ని ఆర్‌- వాల్యూ (రీ ప్రొడక్షన్‌) తెలియజేస్తుంది. దీని ద్వారా వైరస్‌ వ్యాప్తి తీవ్రతపై ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. చెన్నైలోని సితాభ్రా సిన్హా ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌ అధ్యయనం ప్రకారం జూలై మొదటి వారంలో ఢిల్లీలో ఆర్‌ వాల్యూ 1 కంటే తక్కువగా నమోదైంది. జూలై 23- 26 మధ్య 0.66గా ఉంది. అంటే ఢిల్లీలో 100 మందికి కరోనా సోకితే వారి నుంచి కేవలం 66 మందికి మాత్రమే వైరస్‌ సంక్రమించింది. నిజానికి ఆర్‌- వాల్యూ ఒకటి కంటే తక్కువగా ఉండటం ప్రజల రోగనిరోధక వ్యవస్థ మెరుగు పడుతుందనడానికి సంకేతం.

తద్వారా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారని.. ఇది వైరస్‌ అంతానికి నాంది అని ప్రొఫెసర్‌ సిన్హా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రికవరీ రేటు శాతం 89.72 శాతానికి చేరుకోవడం మరింత ఊరట కలిగించే అంశంగా పరిణమించింది. మహారాష్ట్రలో రికవరీ రేటు 62.7% కాగా, తమిళనాడులో 76.3%, గుజరాత్‌తో – 73.2%, మధ్యప్రదేశ్‌లో – 70.2%, పశ్చిమ బెంగాల్‌లో – 69.8%గా ఉండటం గమనార్హం. ఇక పాజిటివ్‌ కేసుల విషయం(ప్రధాన పట్టణాలు)లో ప్రథమ స్థానంలో నిలిచిన ముంబైలో రికవరీ రేటు- 76%, చెన్నైలో– 86 శాతంగా నమోదైంది. 


మరణాల సంఖ్య కూడా తక్కువే..
ఢిల్లీలో కరోనా మరణాల సంఖ్యలో కూడా తగ్గుదల నమోదవడంతో వైరస్‌ ప్రభావం తగ్గినట్లు కనిపిస్తోంది. జూన్‌ 22 నుంచి ఆగష్టు 2 మధ్య కరోనా మృతుల సంఖ్య సగటు భారీగా తగ్గింది. జూలై 25 నాటికి రోజుకు సగటున 30 కరోనా మరణాలు సంభవించగా.. ప్రస్తుతం అది 20కి తగ్గిపోయింది. మొత్తంగా జూన్‌ 20 నాటికి మరణాల రేటు 3.72 శాతం కాగా, జూలై 1 నాటికి 3.12 శాతం, జూలై 10 నాటికి 2.96 శాతం, ఆగష్టు 3 నాటికి ఇది 2.90 శాతానికి తగ్గింది. ఇలా కరోనా టెస్టుల నిర్వహణ, ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో రోగులను అప్రమత్తం చేయడం సహా ప్రజల్లో వైరస్‌ వ్యాప్తిపై అవగాహన కల్పించడంతో కేజ్రీవాల్‌ సర్కారు విజయం సాధించిందని చెప్పవచ్చు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement